ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ విమర్శలు: ప్రొటోకాల్ పాటించనిది ఎవరు ? మోడీనా ? కేసీఆరా ?

ఈ రోజు ప్రభుత్వ అఫీషియల్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ తన ఉపన్యాసంలో తెలంగాణ ప్రభుత్వంపై, భారత రాష్ట్ర సమితిపై విమర్శలు గుప్పించారు.

Advertisement
Update:2023-04-08 14:29 IST

ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వెళ్ళక‌పోవడాన్ని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తప్పుబట్టారు. పైగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ప్రొటోకాల్ పాటించలేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వాదన కోసం కేసీఆర్ చేసింది తప్పు అని అనుకుందాం. మరి ఈ రోజు అఫీషియల్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ తన ఉపన్యాసంలో తెలంగాణ ప్రభుత్వంపై, భారత రాష్ట్ర సమితిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని... అయితే, తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని ప్రధాని మోడీ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు దూరమవుతున్నాయని విమర్శించారు. కుటుంబ పాలన ఉంటే ఇలాగే జరుగుతుందని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో తమ వారి స్వార్థాన్ని ఇక్కడి పాలకులు చూస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో కుటుంబ పాలన, ఆ కుటుంబ అవినీతి పెరిగిపోతోందని మోడీ అన్నారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. ఎక్కడైతే కుటుంబ పాలన ఉంటుందో అక్కడ అవినీతి మొదలవుతుందని చెప్పారు. విచారణ సంస్థలను కూడా బెదిరించే స్థాయికి కుటుంబ పాలకులు వచ్చారని అన్నారు మోడీ.అవినీతిపరులపై కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఈ మాటలన్నీ మోడీ మాట్లాడింది బీజేపీ సభలో కాదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఫీషియల్ మీటింగ్ లో... ఒక అధికారిక కార్యక్రమంలో ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటాన్ని సమర్దించవచ్చా ? ఇది ఏ ప్రోటోకాల్ కిందికి వస్తుంది ? అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు చేయవద్దని ప్రధానికి తెలియదా ? లేక తెలిసే మోడీ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా ?

ఒక వేళ కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్ళి ఉంటే ప్రధాని త‌నపై చేసే విమర్శలకు కేసీఆర్ జవాబిచ్చే అవకాశం కూడా ఉండదు కదా! అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ రావు అన్నారు. కేసీఆర్ ప్రధాని కార్యక్రమానికి పోకపోవడం తప్పైతే, మోడీ చేసిన పని అంతకు వంద రెట్లు ఎక్కువ తప్పని ఆయన ఆరోపించారు.

అంతే కాదు, ''ఈ రాష్ట్ర‍ంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి, ఇక్కడి ఎంపీలకు ఆహ్వానం అందించాలి కానీ అందించలేదు. ఆహ్వాన పత్రంలో ఎంపీల పేర్లుండాలి కానీ లేవు. పీఎంవో ఆయా ఎంపీలకు సమాచారం ఇవ్వాలి కానీ ఇవ్వలేదు.'' అని బీఆరెస్ ఎంపీ కే. కేశవ రావు అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రధాని బీజేపీ కార్యక్రమంగా మార్చారని కేకే ఆరోపించారు. ఇది ప్రోటోకాల్ ధిక్కరణ కాదా అని ఆయన ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News