పట్నం ఇంటికి పైలెట్‌.. కలిసి పని చేయాలని నిర్ణయం

పైలెట్ రోహిత్‌ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తాండూరులో కలిసి పని చేయాలని నిర్ణయించారు.

Advertisement
Update:2023-08-21 22:14 IST

ఉప్పు- నిప్పు కలిసిపోయాయి. అవును.. తాండూరు బీఆర్ఎస్‌ పార్టీలో ప్రత్యర్థులుగా ఉన్న ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కలిసిపోయారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించిన అభ్యర్థు జాబితాలో తాండూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న మహేందర్ రెడ్డికి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే పైలెట్ రోహిత్‌ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తాండూరులో కలిసి పని చేయాలని నిర్ణయించారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రోహిత్‌ రెడ్డి.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మహేందర్‌ రెడ్డిపై విజయం సాధించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో రోహిత్‌ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఇక అప్పటి నుంచి తాండూరు బీఆర్ఎస్‌ రెండు వర్గాలుగా చీలిపోయింది. తాండూరులో రోహిత్‌ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా వర్గపోరు సాగింది. ఇక తాజాగా రోహిత్‌ రెడ్డికి టికెట్ ఖరారు చేసిన కేసీఆర్‌.. మహేందర్‌ రెడ్డిని స్వయంగా బుజ్జగించినట్లు తెలుస్తోంది. మహేందర్‌ రెడ్డికి మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

ఇక తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ప్ర‌వేశించిన‌ పట్నం మహేందర్ రెడ్డి ఆ పార్టీ తరఫున 1994, 1999, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత ..టీఆర్ఎస్‌ పార్టీలో చేరి నాలుగోసారి తాండూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2018లో అనూహ్యంగా పైలెట్‌ రోహిత్‌ రెడ్డి చేతిలో ఓడిపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు సీఎం కేసీఆర్‌. పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి 2018లో కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Tags:    
Advertisement

Similar News