గోషామహల్‌లో భారీగా కుంగిన నాలా రోడ్డు

అర్ధరాత్రి జరగడంతో తప్పిన పెను ప్రమాదం.. ఇప్పటికి రెండు మూడు సార్లు ఇలాంటి ఘటనలు జరిగినా ఎమ్మెల్యే పట్టించుకోడని స్థానికుల ఆగ్రహం

Advertisement
Update:2024-10-23 13:37 IST

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో నాలా రోడ్డు భారీగా కుంగింది. దారుస్సలామ్‌ నుంచి చిక్నావాడికి వెళ్లే రోడ్డు మార్గంలో ఫ్లైవుడ్‌ షాపుల ముందు సివరేజ్‌ పెద్ద నాలా కుంగింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆ సమయంలో రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అతి పురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

గోషామహల్‌ నుంచి మూసీ వైపు ప్రవహించే ప్రధాన నాలా ఇది. చిక్నావాడి ప్రాంతంలో ఒక్కసారిగా కుంగింది. ప్రధాన రోడ్డును నాలా మీద నిర్మించారు. ఈ మార్గం గుండా భారీ వాహనాలు వెళ్తుంటాయి. అలాగే అక్కడే నాలాకు దగ్గరలో ఫ్లైవుడ్‌కు సంబంధించి షాపులు ఉన్నాయి. ఆ దుకాణాలకు సంబంధించిన సరుకులను తరలిస్తుంటారు. కొంతకాలంగా వర్షాలకు ఈ ప్రాంతమంతా నానిపోయింది. ఈ క్రమంలోనే ఈ నాలా ఒక్కసారిగా కుంగిపోయింది. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బారికేడ్లతో ఆ ప్రాంతాన్ని మూసివేశారు. గతంలో ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో ఇదే నాలా కూలిపోయింది. అప్పుడే స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు. గతంలోనూ 14 ఏండ్ల కిందట నాలా కుంగిపోవడంతో దుకాణా దారులే నాలాను పునరుద్ధరించుకున్నారు. తాజాగా నాలా మరోసారి కుంగిపోవడంతో దుకాణాదారులు, అటువైపు వెళ్లే వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులు మాట్లాడుతూ.. నిజాం కాలం నాటి నాలా అని, అప్పటి నుంచి ఇది అలాగే ఉన్నదని దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. గతంలో కూలిపోయినప్పుడు కంప్లైంట్‌ ఇచ్చామన్నారు. అప్పుడు మంత్రిగా ఉన్న తలసాని బాగు చేయించారని... మొత్తం బాగు చేయాలని అప్పుడే చెప్పామన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎప్పుడూ పట్టించుకోరని మండిపడ్డారు. 

Tags:    
Advertisement

Similar News