ఆశలన్నీ రాహుల్ పైనేనా..?

తిరిగి బుధవారం రాష్ట్రానికి రాబోతున్న రాహుల్ మునుగోడు ఉపఎన్నికపై సీనియర్లందరితో మాట్లాడుతారని అనుకుంటున్నారు. సీనియర్లందరు ఏకతాటిపై పనిచేసి అభ్యర్ధిని గెలిపించమని రాహుల్ తో రేవంతే చెప్పారట.

Advertisement
Update:2022-10-23 14:58 IST

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆశలన్నీ రాహుల్ గాంధీ మీదే పెట్టుకున్నట్లున్నారు. నిజానికి మునుగోడు ఉపఎన్నికకు రాహుల్ కు డైరెక్టుగా ఎలాంటి సంబంధంలేదు. కాకపోతే ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో రాహుల్ పాదయాత్ర తెలంగాణాలో ప్రవేశించింది. అగ్రనేతతో పాటు పాదయాత్రలో పాల్గొనే సీనియర్లందరితో మునుగోడులో పార్టీ గెలుపు విషయంలో రాహుల్ దిశానిర్దేశం చేస్తారని అనుకుంటున్నారు.

ఉపఎన్నికలో పార్టీ గెలుస్తుందని ఒకప్పుడు సీనియర్లందరిలో నమ్మకం ఉండేది. ఎందుకంటే సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్తశుద్దితో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపున‌కు పనిచేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎంపీ పెద్ద హ్యాండిచ్చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంత కష్టపడినా స్రవంతి గెలుపు కష్టమే. అదే సీనియర్లందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో అని అనుకుంటున్నారు.

సరిగ్గా ఈ నేపథ్యంలోనే రాహుల్ తెలంగాణాలోకి అడుగుపెట్టారు. దీపావళి పండగ సందర్భంగా ఆదివారం నుండి మూడురోజులు బ్రేకిచ్చి రాహుల్ ఢిల్లీకి వెళ్ళిపోయారు. తిరిగి బుధవారం రాష్ట్రానికి రాబోతున్న రాహుల్ మునుగోడు ఉపఎన్నికపై సీనియర్లందరితో మాట్లాడుతారని అనుకుంటున్నారు. సీనియర్లందరు ఏకతాటిపై పనిచేసి అభ్యర్ధిని గెలిపించమని రాహుల్ తో రేవంతే చెప్పారట. దానికి సానుకూలంగా స్పందించిన రాహుల్ తాను తిరిగిరాగానే సీనియర్లతో మీటింగ్ పెట్టి మాట్లాడుతానని హామీఇచ్చారట. ఈ విషయం తెలియగానే అభ్యర్ధి స్రవంతిలో ఆశలు చిగురిస్తున్నాయట.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే లోకల్ నేతలు మనస్పూర్తిగా పనిచేయకపోతే బయటనుండి వచ్చి పనిచేసే నేతలు ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇదే పెద్ద అడ్వాంటేజయ్యింది. ఎంపీగా, ఎంఎల్ఏగా సోదరులిద్దరు దశాబ్దాలుగా జనాల్లోనే తిరుగుతున్నారు. అయితే హఠాత్తుగా మారిపోయిన వాళ్ళ వైఖరి కారణంగానే పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు, మామూలు జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. మరి రాహుల్ పాదయాత్ర అభ్యర్ధి స్రవంతికి ఎంతమాత్రం ఉపయోగపడుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News