కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి దూసుకెళ్తాడనే భయంతోనే మునుగోడు ఉప ఎన్నిక కుట్ర: జగదీశ్ రెడ్డి
కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడానికే మునుగోడు ఎన్నికలు తీసుకవచ్చారని తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి ని ప్రకటించినప్పటి నుంచి ప్రతి రాష్ట్రంలోని ప్రజలు ఆయన గురించి, తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడంతో దేశ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చిందని, అది చూసి, కేసీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే కుట్రతోనే బీజేపి మునుగోడు ఎన్నికలను ప్రజలపై రుద్దిందని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన 'మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పటి నుంచి ప్రతి రాష్ట్రంలోని ప్రజలు ఆయన గురించి, తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. దీంతో మోడీ, షా తీవ్ర భయాందోళనకు గురయ్యారని అందుకనే ఆయనను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు.
''ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈశాన్య ప్రాంతాల నుంచి గుజరాత్ వరకు ప్రజలు కేసీఆర్ గురించి, తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుతున్నారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీంతో బీజేపీ అగ్రనాయకత్వంలో భయం ఏర్పడి టీఆర్‌ఎస్ అధినేతను అడ్డుకునేందుకు రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.'' అని జగదీష్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
బీజేపీ మొత్తం ప్రతిపక్షాలను అంతమొందించాలని, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అందరినీ టార్గెట్ చేస్తున్న తరుణంలో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ఎదిగారని, కాంగ్రెస్ బలహీనపడిందని జగదీశ్ రెడ్డి అన్నారు.
''ప్రాంతీయ పార్టీలు దర్యాప్తు సంస్థల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. బీజేపీని ఎదిరించే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే అని దేశ ప్రజలు గ్రహించి ఆయనకు మద్దతు ఇస్తున్నారు, 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు, అందుకే తమకు ముప్పుగా పరిణమించే నాయకులను నిలువరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.'' అని జగదీష్ రెడ్డి అన్నారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ ను పెద్ద అడ్డంకిగా బీజేపీ చూస్తోంది. అందుకే ఆయనను జాతీయ రాజకీయాల్లోకి రానీయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి అన్నారు. అయితే ప్రజల్లో ఎలాంటి గందరగోళం లేదని, టీఆర్‌ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో చురుకైన పాత్ర పోషించేందుకే బీఆర్‌ఎస్‌గా మారిందని అర్థం చేసుకున్నారని మంత్రి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ సునాయాసంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన జగదీశ్ రెడ్డి, మునుగోడులో బీజేపీ ఉనికి లేదని స్పష్టం చేశారు. బీజేపీకి మూడో స్థానం దక్కుతుంది'' అని ఆయన అన్నారు.