ములుగులో హోరాహోరీ.. ఓటుకు రూ.5వేలు అంటూ ప్రచారం

ములుగు ఎన్నికల్లో తన ప్రత్యర్థి నాగజ్యోతి కాదని.. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తన ప్రత్యర్థులన్నారు సీతక్క. తనను ఓడించేందుకు రూ.100కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Update:2023-11-13 13:25 IST

ములుగులో హోరాహోరీ.. ఓటుకు రూ.5వేలు అంటూ ప్రచారం

ములుగు ఎన్నికలు ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ కి ప్రతిష్టాత్మకంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్కను ఓడించేందుకు మహిళా అభ్యర్థి బడే నాగజ్యోతిని బరిలో దింపింది బీఆర్ఎస్ అధిష్టానం. నిరుపేద కుటుంబాన్నుంచి వచ్చిన బడే నాగజ్యోతి ఈసారి సీతక్కకు సరైన ప్రత్యర్థి అంటున్నారు. సీతక్కలాగే జనంలో ఒకరిలా నాగజ్యోతి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో ఇక్కడ హోరాహోరీగా పోరు మొదలైంది.

ఇటీవల ములుగులో పర్యటించిన మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సీతక్కకు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని అన్నారు. ములుగు ప్రజలు ఈసారి నాగజ్యోతిని ఆశీర్వదించాలన్నారు. సీతక్క ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. ఈ విమర్శలకు సీతక్క కౌంటర్లిచ్చారు. తాను మంత్రిని కాలేనంటూ హేళనగా మాట్లాడారని, తన నియోజకవర్గ అభివృద్ధికోసం తాను మంత్రిని కాకూడదా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలంతా వచ్చి ప్రచారం చేస్తున్నారని, తనని ఓడించేందుకు కక్షగట్టారని అన్నారు.

ములుగు ఎన్నికల్లో తన ప్రత్యర్థి నాగజ్యోతి కాదని.. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తన ప్రత్యర్థులన్నారు సీతక్క. తనను ఓడించేందుకు రూ.100కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు రూ.5వేలు పంచేందుకు రంగం సిద్ధమైందని, తనను ఓడించడానికి ఎందుకీ ప్రయత్నాలు అని ప్రశ్నించారామె. తనపై బీఆర్ఎస్ కక్షగట్టిందని, అందుకే తన ఓటమికోసం ఇక్కడ విచ్చలవిడిగా డబ్బులు పంచబోతున్నారని చెప్పారు సీతక్క. ములుగు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న తనను వారు ఓడించరని ధీమా వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ గెలిస్తే డబ్బులు గెలిచినట్టు, తాను గెలిస్తే ములుగు ప్రజలు గెలిచినట్టు అని తీర్మానించారు సీతక్క. 

Tags:    
Advertisement

Similar News