తగ్గేదే లేదు.. రేపు ఢిల్లీలో కవిత రౌండ్ టేబుల్ సమావేశం..
బుధవారం ఢిల్లీలోని మెరిడియన్ హోటల్ లో కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఒకరోజు దీక్షతో వెనక్కి తగ్గబోనంటున్న ఆమె, రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మహిళా బిల్లుకోసం బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆ దీక్ష సమయంలో వైరి వర్గాలనుంచి విమర్శలు కూడా వినిపించాయి. రాజకీయ హడావిడి కోసమే ఆమె దీక్ష చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ కవిత చేతలతోనే సమాధానం ఇస్తున్నారు. దీక్ష తర్వాత రేపు మరోసారి ఢిల్లీలో ఆమె రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఒకరోజు దీక్షతో వెనక్కి తగ్గబోనంటున్న ఆమె, రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
బుధవారం ఢిల్లీలోని మెరిడియన్ హోటల్ లో కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం మొదలవుతుంది. ఈ మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీల నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు వస్తారని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన దీక్షకు 18 రాజకీయ పార్టీలనుంచి మద్దతు లభించింది. ఆయా పార్టీల నేతలు కవిత దీక్షా శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. ఆమెతోపాటు తాము కూడా రాజకీయ పోరాటం చేస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. రేపు జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా ప్రతిపక్ష మార్టీల మద్దతు ఉంటుందని, ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలుస్తోంది.
ఈడీ విచారణ..
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈనెల 11న ఆమె తొలిసారి ఈడీ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈనెల 16న రెండోసారి ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసుకుంటూ కేంద్రం వేధిస్తోందని, కవిత విచారణ కూడా ఇందులో భాగమేనని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈడీ విచారణ సందర్భంగా ఢిల్లీలో వెలసిన బ్యానర్లు సంచలనంగా మారాయి.