గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్.. హైకోర్టులో ఆసక్తికర ఘట్టం
రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. కొత్తగా నియమితులైన ఇద్దరు వ్యక్తుల నేపథ్యమేంటని కూడా ధర్మాసనం అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానంగా గవర్నర్ కార్యాలయం తరపు న్యాయవాదులు పాత కథని తెరపైకి తెచ్చారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సులను పూర్తిగా పక్కనపెట్టిన తెలంగాణ గవర్నర్ తమిళిసై, కొత్త ప్రభుత్వం ఇచ్చిన జాబితాపై వెనువెంటనే ఆమోద ముద్రవేయడం రాజకీయ సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అదే సమయంలో బీఆర్ఎస్ సిఫార్సు చేసిన ఇద్దరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. తమను కాదని, కాంగ్రెస్ లిస్ట్ కి గవర్నర్ ఎలా ప్రాధాన్యం ఇచ్చారో తేల్చాలన్నారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడైన కోదండరాంని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి.
బీఆర్ఎస్ అభ్యర్థులు వేసిన పిటిషన్ తో కొత్త ఎమ్మెల్సీల నియామకం ఆగిపోవడం ఓ సంచలనం అయితే.. హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు మరింత ఆసక్తిగా మారాయి. రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. కొత్తగా నియమితులైన ఇద్దరు వ్యక్తుల నేపథ్యమేంటని కూడా ధర్మాసనం అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానంగా గవర్నర్ కార్యాలయం తరపు న్యాయవాదులు పాత కథని తెరపైకి తెచ్చారు.
గత ప్రభుత్వం గవర్నర్‌కు దురుద్దేశాలను ఆపాదించిందన్నారు గవర్నర్ కార్యాలయం తరపు న్యాయవాదులు. గత బడ్జెట్ సమావేశాల్లో సభను ఉద్దేశించి ప్రసంగించడానికి అవకాశం ఇవ్వలేదని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 176కు విరుద్ధమన్నారు. చివరకు కోర్టును ఆశ్రయించిన తరువాత కోర్టు సూచనతో గత ప్రభుత్వం గవర్నర్ ను ఆహ్వానించిందని గుర్తు చేశారు. మొదటిసారి రిపబ్లిక్ డే వేడుకలను కూడా గత ప్రభుత్వం నిర్వహించలేదని తెలిపారు. ముఖ్యమంత్రికి గవర్నర్ వ్యక్తిగతంగా ఆహ్వానం పంపినా స్పందించలేదని, బీఆర్ఎస్ పార్టీ గవర్నర్‌కు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించారని చెప్పడం కొసమెరుపు. మంత్రి మండలి సిఫార్సులను యథాతథంగా ఆమోదించడానికి గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదని, మంత్రి మండలి నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వెనక్కి పంపే అధికారం గవర్నర్ కు ఉందని తెలిపారు న్యాయవాదులు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోననే ఆసక్తి అభ్యర్థులతోపాటు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల్లోనూ ఉంది.