జగిత్యాలకు ఎమ్మెల్యే సంజయ్ రూపాయి తేలేదు : ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు

Advertisement
Update:2024-12-15 13:40 IST

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ కారు గుర్తుపై గెలిచి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్‌లోకి వెళ్లినవ్ సంజయ్ అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత జగిత్యాలలో పర్యటిస్తున్నారు. ధరూర్‌ బైపాస్‌ వద్ద కవితకు గజమాలతో బీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తరలివచ్చారు. బైపాస్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. రేవంత్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు.

మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి రూ.2,500రూపాయలు ఇవ్వడం లేదని, వారికి సీఎం రేవంత్ రెడ్ది 30వేలు బాకీ పడ్డాడని విమర్శించారు. పింఛన్ పెంచుతామని పెంచకుండా అవ్వాతాతలను మోసం సీఎం రేవంత్ మోసం చేశారని కవిత అన్నారు. జగిత్యాల అంటేనే బీఆర్‌ఎస్‌ అడ్డా అని మీ అందర్నీ చూస్తే తెలిసిపోతుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని కవిత అన్నారు. సంవత్సరం నుంచి నాయోజకవర్గం కోసం ఎమ్మెల్యే సంజయ్ రూపాయి తేలేదు.. ఎందుకు పోయినవ్ బాబు అని నిలదీశారు. ప్రజలను వదిలి.. పైసల కోసం వెళ్లినోడు నాయకుడా అని కవిత మండిపడ్డారు. తట్టేడు మట్టి తీయలేదు..అసెంబ్లీకి ఏ మొహం పెట్టుకుని పోతావ్ అని ఆమె ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News