సీతక్క సీఎం అభ్యర్థి.. అసెంబ్లీలో కేటీఆర్ ఛలోక్తులు
తెలంగాణ కాంగ్రెస్, పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లాంటిదని, అందులో ఒక కెప్టెన్, మిగతా 10మంది ఫార్మర్ కెప్టెన్లు ఉంటారన్నారు కేటీఆర్. భట్టి విక్రమార్క ఇక్కడ ప్రసంగిస్తుంటే, ఆయనకు గాంధీ భవన్లో గోతులు తవ్వుతున్నారని సెటైర్లు పేల్చారు.
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు మంత్రి కేటీఆర్ ప్రసంగంలో కాంగ్రెస్ పై చేసిన విమర్శలు హైలెట్ గా నిలిచాయి. తెలంగాణ అభివృద్ధి, బీఆర్ఎస్ పథకాలను, వాటి ఫలితాలను వివరిస్తూనే మధ్య మధ్యలో కాంగ్రెస్ పై ఛలోక్తులు విసిరారు మంత్రి కేటీఆర్. ఒక్క ఛాన్స్ అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజల్ని బతిమిలాడుకుంటున్నారని, కానీ ప్రజలు కాంగ్రెస్ కి 10 ఛాన్స్ లు ఇచ్చారని అయినా ఫలితం లేదని చెప్పారు.
మూడు చెరువుల నీళ్లు..
మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లిచ్చామని, ప్రజలందరికీ మంచి నీళ్లు తాగించామని, ప్రతిపక్షాలకు మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కేటీఆర్. గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు ఎలా ఉన్నాయో అసెంబ్లీలో చెప్పారని, అసెంబ్లీ రికార్డులనుంచే తాను ఆయన మాటల్ని తీసుకుని వినిపిస్తున్నానని చెప్పారు. రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ సభ్యులు అడ్డుచెప్పబోగా.. మీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదా అంటూ సెటైర్లు వేశారు.
సీఎం అభ్యర్థి సీతక్క..
తాను నిజాలు చెబుతుంటే ఒప్పుకోడానికి భట్టి విక్రమార్కకు భేషజాలు ఉండొచ్చేమో కానీ సీతక్కకు ఉండకపోవచ్చన్నారు. సీతక్క నియోజకవర్గం ములుగుని సీఎం కేసీఆర్ జిల్లాగా చేశారని, ములుగు జిల్లా ఉత్తమ జిల్లాపరిషత్ గా అవార్డు కూడా గెలుచుకుందని చెప్పారు. సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రకటించారని కూడా గుర్తు చేశారు. అంతలో శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క అడ్డుతగలగా.. అంటే వారికి సీతక్క సీఎం అభ్యర్థిగా ఇష్టం లేదా అని చురకలంటించారు. తెలంగాణ కాంగ్రెస్, పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లాంటిదని, అందులో ఒక కెప్టెన్, మిగతా 10మంది ఫార్మర్ కెప్టెన్లు ఉంటారన్నారు. భట్టి విక్రమార్క ఇక్కడ ప్రసంగిస్తుంటే, ఆయనకు గాంధీ భవన్లో గోతులు తవ్వుతున్నారని సెటైర్లు పేల్చారు. ఇటీవల పాదయాత్ర చేసి భట్టి విక్రమార్క అలసిపోయారని, ఆయనకు కన్ఫ్యూజన్ ఉంది కానీ, క్లారిటీ లేదన్నారు. స్పీకర్ అనుమతితో భట్టి విక్రమార్కకు నిమ్స్ లో ఆస్పత్రిలో ఫిజియో థెరపీ చేయిస్తామన్నారు కేటీఆర్.