స్కాంగ్రెస్.. సార్థక నామధేయం
ఒకరేమో రూ.50 కోట్లకు పీసీసీ సీటు అమ్మారు, ఇంకొకరు ఆ సీటుని కొనుక్కున్నారు. ఇలాంటి వారు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అవినీతి పై లెక్చర్ ఇవ్వడం హాస్యాస్యదం అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రాహుల్ చేసిన విమర్శలకు కౌంటర్లిచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు అవినీతి గురించి రాహుల్ ప్రస్తావించడాన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ అసలు పేరు స్కాంగ్రెస్ అని.. ఆ పేరుని సార్థకం చేసుకుందని ట్విట్టర్లో మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
బస్సు యాత్రలో రాహుల్ గాంధీ.. అవినీతి గురించి ప్రస్తావించారు, ప్రసంగించారు. ఆయన ప్రసంగించే సమయంలో పక్కనే రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ కి అనుకోని వరంలా మారింది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పైగా కాంగ్రెస్ నేతలు గతంలో చేసిన ఆరోపణలనే ఈ సందర్భంగా గుర్తు చేయడం విశేషం.
ఒకరేమో రూ.50కోట్లకు పీసీసీ సీటు అమ్మారు, ఇంకొకరు ఆ సీటుని కొనుక్కున్నారు. ఇలాంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే.. ఆ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ అవినీతి పై లెక్చర్ ఇవ్వడం హాస్యాస్యదం అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్కాంగ్రెస్ అనేది ఆ పార్టీ సార్థక నామధేయం అన్నారు కేటీఆర్.
తెలంగాణలో ప్రధాని మోదీ, అమిత్ షా సభల తర్వాత కూడా వాతావరణం ఈ స్థాయిలో వేడెక్కలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంలో మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ఇచ్చింది మేమేనంటూ కాంగ్రెస్ చెప్పుకుంటోంది, ఇప్పుడు ప్రజల తెలంగాణ సాకారం చేస్తామంటోంది. 60 ఏళ్లలో ఏమీ చేయలేని కాంగ్రెస్ ని తెలంగాణ ప్రజలు నమ్మరు అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒక్క ఛాన్స్ అంటూ మాయమాటలు చెబుతున్నారని మండిపడుతున్నారు. ఆపదమొక్కులు మొక్కేవారికి అవకాశం ఇవ్వొద్దని ప్రజలకు హితబోధ చేస్తున్నారు. రాహుల్ పర్యటనతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాతావరణం వేడెక్కింది.