ప్రీతి విషయంలో దోషి సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదిలిపెట్టం : మంత్రి కేటీఆర్

ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ప్రతీ చిన్న విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

Advertisement
Update:2023-02-27 18:17 IST

కేఎంసీ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ప్రీతి విషయంలో దోషి ఎవరైనా శిక్షిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ ఘటన వెనుక ఉన్నది సైఫ్ అయినా, సంజయ్ అయినా మరెవరైనా ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం సోడాషపల్లిలో జరిగిన రైతు కృతజ్ఞత సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ప్రతీ చిన్న విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

వరంగల్‌లో ఎంజీఎంలో పీజీ విద్యార్థిని ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో, ర్యాగింగ్ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నది. ఆ అంశాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాము. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ఇలా అందరూ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని చెప్పారు. డాక్టర్ ప్రీతి కుటుంబానికి ఈ వేదిక నుంచి హృదయపూర్వకంగా పార్టీ తరపున, ప్రభుత్వం తరపున సంతాపం తెలియజేస్తున్నానని కేటీఆర్ అన్నారు.

ఆ కుటుంబాన్ని కొన్ని పార్టీలు వాడుకోవచ్చు. నాలుగు చిల్లరమల్లర మాటలు మాట్లాడవచ్చు. కానీ నేను చెప్తున్నాను.. పార్టీ తరపున, ప్రభుత్వం తరపున అండగా ఉంటాం.. అన్ని రకాలుగా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అన్యాయం చేసిన వాడు ఎవరైనా.. ఆ దోషి సైఫ్ కావొచ్చు.. సంజయ్ కావొచ్చు.. ఇంకొకరు కావొచ్చు.. ఎవరైనా సరే వాడిని వదిలి పెట్టము. తప్పకుండా చట్ట పరంగా, న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతీ చిన్న అంశాన్ని రాజకీయం చేయడం.. చిల్లర మాటలు మాట్లాడటం ప్రతిపక్షాలకు ఆనవాయితీ అయిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News