సుఖేష్ పై చట్టపరమైన చర్యలకు కేటీఆర్ సిద్ధం..
సుఖేష్ అనే వ్యక్తి లేఖ విడుదల చేశాడంటూ వచ్చిన వార్తలు తన దృష్టికి వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. ఆ రోగ్ ఎవడో తనకు తెలియదన్నారు.
మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అనే ఖైదీ ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాడు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ తెలంగాణ గవర్నర్ కి సుఖేష్ ఓ లేఖ రాశాడంటూ మీడియాలో వార్తలొచ్చాయి. తనను వారిద్దరూ బెదిరిస్తున్నారని సుఖేష్ చెప్పినట్టు కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. అసలు సుఖేష్ ఎవరో తనకు తెలియదన్నారు.
నిజానిజాలు తెలుసుకోవాలి..
సుఖేష్ అనే వ్యక్తి లేఖ విడుదల చేశాడంటూ వచ్చిన వార్తలు తన దృష్టికి వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. ఆ రోగ్ ఎవడో తనకు తెలియదన్నారు. సుఖేష్ వ్యాఖ్యలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు కేటీఆర్. ఇలాంటి నిరాధార ఆరోపణలు ప్రచురించే ముందు మీడియా కూడా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు కేటీఆర్.
ఎవరీ సుఖేష్..?
రాన్ బాక్సీ సంస్థ మాజీ ప్రమోటర్లకు ఓ కేసు విషయంలో బెయిల్ ఇప్పిస్తానంటూ వారి కుటుంబ సభ్యుల వద్ద రూ.200 కోట్లు కొట్టేసిన ఘనుడు సుఖేష్. ప్రస్తుతం ఇదే కేసులో తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతడికి గర్ల్ ఫ్రెండ్ అనే ప్రచారం ఉంది. ఆమెకు సుఖేష్ కాస్ట్ లీ బహుమతులిచ్చినట్టు చెబుతుంటారు. జైలులో రాజభోగాలు అనుభవిస్తుంటాడని, దానికోసం భారీగా ఖర్చు చేస్తుంటాడని కూడా ఇతనిపై అభియోగాలున్నాయి. బ్లాక్ మెయిలింగ్ కోసం అప్పుడప్పుడూ సుఖేష్ లేఖలు విడుదల చేస్తుంటాడు, మీడియాలో హైలెట్ అవుతుంటాడు. తాజాగా సుఖేష్ తెలంగాణ గవర్నర్ కు లేఖ రాశారంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి. మంత్రి కేటీఆర్ ఈ వార్తలను ఖండించారు. అసలు సుఖేష్ ఎవరో తనకు తెలియదంటూ వివరణ ఇచ్చారు.