మాయమాటలు నమ్మొద్దు.. ఆగం కావొద్దు.. – మంత్రి హరీష్‌రావు

బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారంటూ రేవంత్‌రెడ్డి విద్యార్థులను చులకన చేసి మాట్లాడారని హరీష్‌రావు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడానికి భయపడేది తాము కాదని, రేవంత్‌రెడ్డి అని తెలిపారు.

Advertisement
Update:2023-11-27 10:26 IST

కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి రిస్క్‌ తీసుకోవద్దని, ఆగం కావొద్దని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మంత్రి హరీష్‌రావు ఓటర్లను కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ మీడియా ఛాన‌ల్ లైవ్‌లో తాజాగా ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తెలంగాణను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఇంటింటికీ నీళ్లిచ్చామని, 24 గంటల కరెంటు ఇచ్చామని, 69 లక్షల మంది రైతులకు రైతుబంధు, 47 లక్షల మందికి ఆసరా పింఛన్లు, 1.10 లక్షల మందికి రైతు బీమా, 13.50 లక్షల మందికి కల్యాణలక్ష్మితో లబ్ధి చేకూర్చామని తెలిపారు. వెయ్యి రెసిడెన్షియల్‌ పాఠశాలలు తీసుకొచ్చామని చెప్పారు. అక్షరాస్యత 15 నుంచి 20 శాతం పెరిగిందని తెలిపారు. ఇవన్నీ కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్‌ సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.

అక్కడ ఏం చేశారని ఇక్కడ ప్రకటనలు ఇస్తున్నారు..?

కర్ణాటకలో ఏం చేసిందని అక్కడి ప్రభుత్వం తెలంగాణలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇస్తోందని హరీష్‌రావు ప్రశ్నించారు. కర్ణాటక ఇచ్చే ప్రకటనలన్నీ అబద్ధాలని ఆయన విమర్శించారు. యువశక్తి అని యాడ్‌ ఇచ్చారని.. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారని, బస్సులు కూడా లేకుండా చేశారని చెప్పారు. 10 కిలోల ఉచిత బియ్యం అని 5 కిలోలు ఇస్తున్నారన్నారు. కర్ణాటక మోడల్‌ అంటే 3 గంటల కరెంటు, రైతుబంధు తొలగింపు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమా..? అంటూ ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ ప్రజల పార్టీ..

ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని హరీష్‌ రావు చెప్పారు. 24 గంటల కరెంట్, మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీరు ఇచ్చామని చెప్పారు. వీటిపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని, పూర్తిస్థాయిలో కరెంట్, ఇంటింటికీ నీళ్లు వచ్చినోళ్లంతా కారుకు ఓటేయండి.. రాని వారు కాంగ్రెస్‌కు ఓటేయండి.. అని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా లేనివిధంగా రైతుబంధును రాష్ట్రంలో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దానిని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పేరుతో అమలు చేస్తోందని చెప్పారు. అధికారంలోకి వస్తే రైతుబంధు కింద కాంగ్రెస్‌ పార్టీ రూ.15 వేలు ఇస్తామని చెబుతోందని, కానీ తాము రూ.16 వేలు ఇస్తామని చెబుతున్నామని వివరించారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని, కేసీఆర్‌ రైతుబిడ్డ.. ఆయన ఫోకస్‌ అంతా రైతులేనని చెప్పారు.

విద్యార్థులను చులకనగా మాట్లాడతారా?

బీర్లు, బిర్యానీ ఇస్తే ఏమైనా చేస్తారంటూ రేవంత్‌రెడ్డి విద్యార్థులను చులకన చేసి మాట్లాడారని హరీష్‌రావు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడానికి భయపడేది తాము కాదని, రేవంత్‌రెడ్డి అని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు కుటుంబపాలన అనడం విడ్డూరంగా ఉందని, ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్‌, ప్రియాంక‌ గాంధీ వీరంతా ఎవరని నిలదీశారు. తాము ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వాళ్లమని, తమది కుటుంబ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తాము 80 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News