వారిది అధికార యావ.. మాది అభివృద్ధి తోవ

వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన తాము వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాల్ని బలోపేతం చేశామని.. మూడో దఫా ఎన్నికల్లో గెలిచాక గృహ నిర్మాణంపై దృష్టిపెడతామని చెప్పారు హరీష్ రావు.

Advertisement
Update:2023-10-25 07:31 IST

వారిది అధికార యావ.. మాది అభివృద్ధి తోవ

తెలంగాణలో కేసీఆర్‌ ఎన్నికల సభలు విజయవంతం కాగా.. కాంగ్రెస్, బీజేపీ సభలు వెలవెలబోయాయని అన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్‌ రాకపోతే కరెంటు ఎలా అన్న ఆందోళన రైతుల్లో ఉందని చెప్పారు. రాష్ట్రంలో 44 లక్షల మందికి ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి 2 వేలకు పెంచిన ఘనత కేసీఆర్ దేనని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో పెన్షన్ రూ.5 వేలు చేస్తామని హామీ ఇచ్చింది కూడా కేసీఆర్ ఒక్కరేనని, ఆయనే ఆ హామీ నిలబెట్టుకుంటారన్నారు హరీష్ రావు. కేసీఆర్‌.. మా పెద్దకొడుకు, పెద్దన్న అని ప్రజలు అంటున్నారని.. ఆయన చెబితే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందని, విపక్షాలకు ఆ పరిస్థితి లేదని చెప్పారు. కేసీఆర్‌ కచ్చితంగా హ్యాట్రిక్‌ సాధిస్తారని చెప్పారు హరీష్ రావు.

ఎన్నికల్లో బీఆర్ఎస్ కి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు హరీష్ రావు. కొందరు ఎమ్మెల్యేలపై కొంచెం అసంతృప్తి ఉన్నా కూడా సంతృప్తి చెందిన ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. అన్నింటికంటే మించిన బలం మా కేసీఆర్‌ అని చెప్పారు. ఆయన నాయకత్వంలో ప్రతి ఎమ్మెల్యే వేల మందికి సహాయం చేశారని.. సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, డబుల్‌ బెడ్రూం ఇళ్లు వంటి అనేక కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని అన్నారు. తొమ్మిదన్నరేళ్లలో కరవు లేదు, కర్ఫ్యూ లేదని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలు బాగుండటంతోనే పరిశ్రమలు వస్తున్నాయని, ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన పెరిగిందని చెప్పారు హరీష్ రావు.

TSPSCలో ప్రశ్నాపత్రాల లీకేజీ బాధాకరం అని చెప్పారు హరీష్ రావు. దాన్ని ప్రభుత్వమే గుర్తించి సీఐడీతో విచారణ జరిపించి, వెంటనే దోషులందరినీ అరెస్టు చేసిందని చెప్పారు. అత్యంత పారదర్శకమైన పద్ధతుల్లో మిగిలిన నియామకాలను పూర్తిచేస్తామన్నారాయన. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి మొదటి విడత ప్రచారాన్ని పూర్తిచేయగా.. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు టికెట్ల కోసం ఇంకా ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీల ప్రచారం కోసం కూడా మళ్లీ ఢిల్లీ నుంచే నాయకులు రావాలన్నారు. వారికి స్వయం నిర్ణయాధికారం లేదని విమర్శించారు హరీష్ రావు. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన తాము వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాల్ని బలోపేతం చేశామని.. మూడో దఫా ఎన్నికల్లో గెలిచాక గృహ నిర్మాణంపై దృష్టిపెడతామని చెప్పారు హరీష్ రావు. 

Tags:    
Advertisement

Similar News