తెలంగాణలో మెడ్ ట్రానిక్ రూ. 3వేలకోట్ల పెట్టుబడులు
3వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో ఆర్ అండ్ డి సెంటర్ ఏర్పాటు చేస్తామంటోంది మెడ్ ట్రానిక్ సంస్థ. మంత్రి కేటీఆర్ తో మెడ్ ట్రానిక్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఒప్పందం కుదుర్చుకున్నారు.
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకొస్తోంది. మెడికల్ పరికరాల ఉత్పత్తి సంస్థ మెడ్ ట్రానిక్ తాజాగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించింది. హైదరాబాద్ లో మెడికల్ డివైజెస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
దాదాపు 3వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో ఆర్ అండ్ డి సెంటర్ ఏర్పాటు చేస్తామంటోంది మెడ్ ట్రానిక్ సంస్థ. మంత్రి కేటీఆర్ తో మెడ్ ట్రానిక్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఒప్పందం కుదుర్చుకున్నారు.
మెడ్ ట్రానిక్ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలతో పెట్టుబడులు తరలివస్తున్నాయనడానికి ఇది మరో నిదర్శనం అని చెప్పారు కేటీఆర్.
అమెరికా వెలుపల ఇదే పెద్దది..
ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ లో అతి పెద్ద బ్రాంచ్ లు ఏర్పాటు చేస్తున్నాయి. మెడ్ ట్రానిక్ కూడా అమెరికా వెలుపల అతి పెద్ద ఆర్ అండ్ డి సెంటర్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడం విశేషం. “సాంకేతిక ఆవిష్కరణలకు భారతదేశం గ్లోబల్ హబ్ గా ప్రసిద్ధి చెందిందని మెడ్ ట్రానిక్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల కోసం వృద్ధి చెందుతున్న మార్కెట్ గా భారతదేశ సామర్థ్యాన్ని విశ్వసిస్తున్నామని తెలిపారు. భారత్ లో మెడ్ ట్రానిక్ కార్యకలాపాలకు హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా నిరూపించబడిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం వల్ల హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్ గా మారిందని తెలిపారు.
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. మీడియా, ఎంటర్ టైన్ మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. తాజాగా మెడి ట్రానిక్ 3వేల కోట్ల రూపాయాల భారీ పెట్టుబడితో తెలంగాణకు రావడానికి సిద్ధమైంది.