మేడారం మినీ జాతరకు ముహూర్తం ఖరారు..
Mini Medaram Jatara in Telangana: ఫిబ్రవరి 1న మండమెలిగ పండగ నిర్వహిస్తారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గద్దె, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క – సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క - సారలమ్మల జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. మధ్యలో ఏడాది మినీ జాతర పేరుతో వేడుక నిర్వహిస్తారు. ఈ మినీ జాతరకు ముహూర్తం ఖరారు చేశారు పూజారులు. ఈమేరకు జాతర పూజారుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది.
జాతర నిర్వహణ కోసం మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే మేడారం జాతర పండగ తేదీలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు ఈవో, పూజారుల సంఘం.. ఆ వివరాలను వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగ పండగ నిర్వహిస్తారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గద్దె, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క – సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. కానీ, గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతరకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ కుంభమేళా అని పేరు. జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఈ మహా జాతర జరుగుతుంది. జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. రెండేళ్లకోసారి మేడారం మహాజాతరను నిర్వహిస్తారు. అయితే మధ్యలో ఏడాది మినీ మేడారం జాతరను నిర్వహిస్తుంటారు.