శ్రీలంక ప్రధాన బౌద్ధ భిక్షువును బుద్ధవనానికి ఆహ్వానించిన మల్లేపల్లి

మౌఖిక సాహిత్యంగా ఉన్న బుద్ధ వచనాన్ని తొలిసారిగా తాళపత్రాలపై లిఖించిన మాతలే బౌద్ధ గుహల్ని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదివారం సందర్శించారు.

Advertisement
Update:2023-09-24 06:00 IST

అశోక సామ్రాటు సమకాలికుడైన శ్రీలంక రాజు దేవానాంపియ తిస్స ఆధ్వర్యంలో, అప్పటివరకు మౌఖిక సాహిత్యంగా ఉన్న బుద్ధ వచనాన్ని, తొలిసారిగా తాళపత్రాలపై లిఖించిన మాతలే బౌద్ధ గుహల్ని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదివారం సందర్శించారు. బుద్ధ వచనాన్ని (త్రిపీటకాలను) బహ్మీ లిపిలో అక్షర బద్ధం చేసిన ఘనతను శ్రీలంక దక్కించుకుందని, ఆ తర్వాతే సూత్ర, వినయ, అభిధమ్మ పిటకాలు మనదేశంలో అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు.

తెలుగు నేలకు చెంది, శ్రీలంక బౌద్ధ సంఘ నాయకునిగా ఎన్నుకోబడిన క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన ఆచార్య బుద్ధఘోషుడు కూడా మాతలే బౌద్ధ గుహలో కొంతకాలం నివసించి, విశుద్ధిమగ్గ అన్న బౌద్ధ గ్రంథాన్ని రాశాడని, ఆచార్య బుద్ధఘోషుని పేర ఇక్కడ ఒక పాఠశాలను ఇప్పటికీ నిర్వహిస్తున్న శ్రీలంక బౌద్ధుల్ని ఆయన అభినందించారు. బుద్ధవనం ప్రాజెక్టు బుద్ధిస్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డా. ఈమని శివనాగిరెడ్డి క్రీ.పూ. 3వ శతాబ్దినాటి మాతలే గుహలను తొలచిన తీరును, అక్కడ లభించిన పురావస్తువులను పరిశీలించారు.

అనూరాధపురం మహావిహార ప్రధాన భిక్షువు, జ్ఞానతిలకథెరొను కలిసిన మల్లేపల్లి లక్ష్మయ్య, ఆయనను బుద్ధవనానికి ఆహ్వానించారు. బుద్ధవనం ప్రత్యేకతలను వివరించిన లక్ష్మయ్య, శివనాగిరెడ్డిలకు మహావిహార జ్ఞాపికలను అందించి, త్వరలో బుద్ధవనం సందర్శిస్తానని జ్ఞానతిలక తెలిపారని లక్ష్మయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో, శ్రీలంక సెంట్రల్ కల్చరల్ ఫండ్, డైరెక్టర్ జనరల్ ఆచార్య గామిని రణసింఘె పాల్గొన్నారు.


Tags:    
Advertisement

Similar News