తెలంగాణ ప్రభుత్వ డిమాండుకు లైన్ క్లియర్.. ఓబీసీ జాబితాలోకి 40 బీసీ కులాలు!

రాష్ట్ర బీసీ కమిషన్ గతంలోనే సదరు 40 కులాలకు చెందిన సామాజిక, ఆర్థిక పరిస్థితిపై నివేదికను ఎన్‌సీబీసీకి అందజేసింది.

Advertisement
Update:2023-06-19 09:06 IST

తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతున్న అంశానికి లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 40 బీసీ కులాలను కేంద్రంలోని ఓబీసీ జాబితాలో చేర్చాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కాగా, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎన్‌సీబీసీ) ఇటీవల సదరు 40 కులాల జాబితాను పునపరిశీలించాలని నిర్ణయించింది.

రాష్ట్ర బీసీ కమిషన్ గతంలోనే సదరు 40 కులాలకు చెందిన సామాజిక, ఆర్థిక పరిస్థితిపై నివేదికను ఎన్‌సీబీసీకి అందజేసింది. గతంలో తెలంగాణకు చెందిన 138 కులాలు కేంద్రంలోని ఓబీసీ జాబితాలో ఉండేవి. కానీ కొన్ని కారణాల వల్ల 40 కులాలను ఆ జాబితా నుంచి తొలగించారు. ఆ కులాలనే తిరిగి ఓబీసీ జాబితాలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా డిమాండ్ చేస్తోంది.

కేంద్ర సోషల్ జస్టిస్, ఎంపవర్‌మెంట్ మినిస్ట్రీ గత వారం హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, జమ్ము అండ్ కశ్మీర్‌కు చెందిన 16 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చింది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోని బీసీ కులాలపై ఎన్‌సీబీసీ దృష్టి పెట్టింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే సదరు 40 కులాలను ఓబీసీ జాబితాలోకి చేర్చే నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని తెలుస్తున్నది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సదరు 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం పలు మార్లు కేంద్రానికి లేఖలు రాసింది. కానీ గత 15 ఏళ్లుగా ఈ విషయం పెండింగ్‌లోనే ఉన్నది.

తెలంగాణ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన స్థితిగతులను తెలుసుకోవడానికి మరోసారి సర్వే నిర్వహించనున్నారు. సదరు నివేదికను ఎన్‌సీబీసీకి పంపితే.. ఆ 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర కేబినెట్‌కు ఎన్‌సీబీసీ సిఫార్సు చేయనున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు అవుతుందని అధికారులు తెలిపారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వెలువడనున్నది.

Tags:    
Advertisement

Similar News