ఆమె బాధ్యత నాది.. చిన్నారికి అండగా కేటీఆర్
తాజాగా లకాన్ సింగ్ మరో పెళ్లి చేసుకోవడంతో పాప ఒంటరిగా మారిందని మరోసారి కేటీఆర్ దృష్టికి తెచ్చాడు నవీన్.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తల్లి మరణించి, తండ్రి మరో పెళ్లి చేసుకోవడంతో ఒంటరిగా మారిన చిన్నారి బాధ్యతను తీసుకునేందుకు ముందుకు వచ్చారు. గతంలో కరోనా టైమ్‌లోనూ ఈ చిన్నారికి కేటీఆర్ సాయం అందించడం గమనార్హం. తాజాగా మరోసారి ఆ చిన్నారి ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న కేటీఆర్.. ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఇంతకీ ఏం జరిగిందంటే !
ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్‌నగర్‌కు లకాన్‌సింగ్, జ్యోతి దంపతులు. వీరికి ఓ పాప ఉంది. పాప పుట్టిన ఐదు నెలలకే తల్లి జ్యోతి అనారోగ్యంతో మరణించింది. కరోనా టైమ్‌లో ఉపాధి లేక తండ్రి లకాన్ సింగ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. లాక్‌డౌన్ టైమ్ కావడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పాపకు పాలు కొనలేని స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేయగా.. వెంటనే స్పందించి స్థానిక నాయకులను అలర్ట్ చేశారు. వెంటనే పాపకు పాలతో పాటు ఆ కుటుంబానికి నెలకు సరిపడా సరుకులను అందించారు. ఇదంతా 2020 ఏప్రిల్ లాక్‌డౌన్ టైమ్‌లో జరిగింది.
తాజాగా లకాన్ సింగ్ మరో పెళ్లి చేసుకోవడంతో పాప ఒంటరిగా మారిందని మరోసారి కేటీఆర్ దృష్టికి తెచ్చాడు నవీన్. గతంలో పాల కోసం ట్వీట్ చేసిన విషయాన్ని కేటీఆర్‌కు గుర్తు చేసిన నవీన్.. పాప తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు పాప ఇబ్బందుల్లో ఉందని చెప్పాడు. ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్.. ఆ చిన్నారి వివరాలను తనకు పంపాలని, తన విద్యకు సంబంధించిన బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.