ఊసరవెల్లి రంగులు మార్చుడు.. రేవంత్ తారీఖులు మార్చుడు - కేటీఆర్
రేవంత్ రెడ్డి ఇకనైనా చేసిన తప్పును అంగీకరించి.. చెంపలేసుకోవాలన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
రాజన్న సిరిసిల్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత నాలుగున్నర నెలల్లో రేవంత్ రెడ్డి చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. కేసీఆర్ చేసిన పనులకు వ్యతిరేకంగా చేయడమే రేవంత్ పని అన్నారు కేటీఆర్.
జిల్లాల పునర్విభజనపై రేవంత్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేశామని.. ఇప్పుడు ఆ జిల్లాలను కుదించేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కొత్త జిల్లాలు కొనసాగించాల్సిందేనన్నారు కేటీఆర్. ఏ ఒక్క జిల్లాను రద్దు చేసినా ప్రజా ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి ఇకనైనా చేసిన తప్పును అంగీకరించి.. చెంపలేసుకోవాలన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. 6 గ్యారెంటీల్లో 5 హామీలు అమలు చేశామని రేవంత్ బొంకుతున్నారన్నారు కేటీఆర్. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు.. హామీల అమలుపై రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకే దిక్కులేదని.. కొత్తగా మరో 5 హామీలతో డ్రామా మొదలు పెట్టారని ఆరోపించారు.