8+8 = 0.. కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ సెటైర్లు

సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, IIM సహా ఒక్క జాతీయ సంస్థను కూడా కేటాయించలేదన్నారు కేటీఆర్‌. మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ స్పందన లేదన్నారు.

Advertisement
Update:2024-07-23 15:10 IST

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో విమర్శలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ.. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేసింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు చెరో 8 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే తెలంగాణకు తెచ్చింది జీరో అంటూ ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

కేటీఆర్ ఏమన్నారంటే?

తెలుగు కోడలు నిర్మలా సీతారామన్‌ తెలంగాణ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ దక్కింది శూన్యం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ.. కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని పెదవి విరిచారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి గుండు సున్నానే దక్కిందన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని 35 హామీలపై నిర్ణయం తీసుకోవాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా వృథా అయ్యాయన్నారు. బ‌డ్జెట్‌లో ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు.


సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, IIM సహా ఒక్క జాతీయ సంస్థను కూడా కేటాయించలేదన్నారు కేటీఆర్‌. మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగినప్పటికీ, ఆ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలను గెలిపిస్తే ఏం జరిగిందో.. ఏపీ, బిహార్‌కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీ రామరక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలను ఎందుకు బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన రుజువు చేసిందన్నారు. గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్‌లో ఉంటే కచ్చితంగా కేంద్రం వైఖరిని వ్యతిరేకించేవాళ్లన్నారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News