రేవంత్ రెడ్డి మైక్ వీరుడు.. కేటీఆర్ సెటైర్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే హామీలు అమలు చేసినట్టు హడావిడి సృష్టించిందని, దానికి అసలు కారణం వేరే ఉందని చెప్పారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి మైక్ వీరుడంటూ సెటైర్లు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మైక్ పట్టుకుంటే చాలు పూనకం వచ్చి.. ఏది పడితే అది మాట్లాడతారని అన్నారు. అలవికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టారని, ఇప్పుడిప్పుడే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని, రేవంత్ రెడ్డి వ్యవహారం పూర్తిగా ప్రజలకు అర్థమైందని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో భువనగిరి పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు బీఆర్ఎస్ భయపడే పరిస్థితి లేదని చెప్పారు.
రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని కోతలు కోశారని.. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందని చెప్పారు కేటీఆర్. ప్రభుత్వానికి అవగాహన, తెలివి లేకపోవడమే దీనికి కారణం అని విమర్శించారు. ఫార్మాసిటీకి అన్ని అనుమతులు తెచ్చి, భూసేకరణ చేసినా దాన్ని నడుపుకునే తెలివి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. కంపెనీలు, ఫ్యాక్టరీలు, విద్యాసంస్థలు వస్తే రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా అమలు కావడం లేదని చెప్పారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే ఫ్యాక్టరీలు తరలిపోతున్నాయని అన్నారు కేటీఆర్.
ఎన్నికలకోసమే పథకాలు..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే హామీలు అమలు చేసినట్టు హడావిడి సృష్టించిందని, దానికి అసలు కారణం వేరే ఉందని చెప్పారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయన్న ఒకేఒక్క కారణంతో పథకాలు మొదలు పెట్టారని, ఎన్నికల తర్వాత అన్నిటికీ మంగళం పాడేస్తారని అన్నారు. 100 రోజుల్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒక్కటే పూర్తి స్థాయిలో మొదలైందని.. అది కూడా ఎన్నికల తర్వాత ఆగిపోతుందని చెప్పారు. ఆ పథకం వల్ల ఆర్టీసీకి రూ. 1400 కోట్ల నష్టం వచ్చిందని అన్నారు కేటీఆర్. తులం బంగారం ఇస్తామని మహిళల్ని మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ మోసాలన్నిటినీ లోక్ సభ ఎన్నికల వేళ ప్రజలకు వివరించి చెప్పాలన్నారు కేటీఆర్.