గజ్వేల్ కంటే మునుగోడులోనే రైతుబంధు లబ్ధిదారులు ఎక్కువ -కేటీఆర్

మునుగోడు ఓటర్లు 2.41 లక్షలమంది కాగా.. అందులో రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 2,38,915 మంది అని వివరించారు కేటీఆర్. నియోజకవర్గంలో 99.1 శాతం మందికి ప్రభుత్వ సాయం అందుతోందని చెప్పారు.

Advertisement
Update:2022-10-20 07:07 IST

మునుగోడు ఉప ఎన్నికలో ఓట్లు అడిగే హక్కు ఒక్క టీఆర్ఎస్ కి మాత్రమే ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. మునుగోడులో అభివృద్ధి జరిగిందని ధైర్యంగా చెబుతూ తాము ఓట్లు అడుగుతున్నామని అన్నారు. నాలుగేళ్లపాటు మునుగోడుని ఏమాత్రం పట్టించుకోని రాజగోపాల్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారాయన. మునుగోడులో పోటీ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యేనని చెబుతున్న కేటీఆర్.. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే తాను నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

99.1శాతం మంది లబ్ధిదారులే..

మునుగోడు ఓటర్లు 2.41 లక్షలమంది కాగా.. అందులో రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 2,38,915 మంది అని వివరించారు కేటీఆర్. అంటే 99.1 శాతం మందికి ప్రభుత్వ సాయం అందుతోందని చెప్పారు. 1,46,284మంది రైతులకు రైతు బంధు ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ కంటే ఈ సంఖ్య ఎక్కువని చెప్పారు. తమకు గజ్వేల్ అయినా, మునుగోడు అయినా అన్నీ సమానమేనన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాత్రం గుజరాత్ వేరే, తెలంగాణ వేరేనని చురకలంటించారు కేటీఆర్.

ఎన్నికల వేళ గుజరాత్‌ కు కేంద్రం గత 5 నెలల్లో రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్. మరో రూ. 15 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారని చెప్పారు. సొమ్ము తెలంగాణది.. సోకు గుజరాత్‌, యూపీలది అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణకు కేటాయింపులు ఎందుకు లేవంటూ ప్రశ్నించారు. నియోజకవర్గాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ వివక్ష చూపలేదని, కానీ కేంద్రం మాత్రం బీజేపీ పాలిత రాష్ట్రాలపై నిధులు కుమ్మరిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. ముఖ్యంగా తెలంగాణను తీవ్ర వివక్షకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోవర్టు రాజకీయాలు చెల్లవు..

మూడేళ్ల పాటు బీజేపీ కోవర్టుగా ఉండి నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి అనాథగా మార్చారని, రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు దొరికిన తర్వాత ఆ పార్టీలో చేరి, ప్రజలపై ఉప ఎన్నిక భారం మోపారని చెప్పారు కేటీఆర్. శాసనసభలో కూడా ప్రజాసమస్యలపై కాకుండా కాంట్రాక్టర్లు, బిల్లుల గురించే మాట్లాడేవారని గుర్తు చేశారు. డబ్బుతో ఓట్లు కొందామనుకుంటున్న వారికి మునుగోడు ఉప ఎన్నికల్లో చోటులేదని చెప్పారు. ప్రజల కోసం పనిచేసేది, పనికొచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. బీజేపీ అన్ని వర్గాలను కష్టపెడుతోందని విమర్శించారు కేటీఆర్. నూకలు తినాలని అవహేళన చేసిన బీజేపీ నేతల తోకలను ఈ ఎన్నికల్లో రైతులు కత్తిరిస్తారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News