భారత్ కు వరల్డ్ కప్ గ్యారెంటీ.. కేసీఆర్ హ్యాట్రిక్ గ్యారెంటీ
వ్యక్తిగత సంక్షేమం, అభివృద్ధి ఫలాలు దాదాపు 90 శాతం మంది ప్రజానీకానికి అందాయని.. అందుకే మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ తోనే ఉంటారనే విశ్వాసం తమకు ఉందని చెప్పారు కేటీఆర్. హ్యాట్రిక్ గ్యారెంటీ అని ధీమాగా చెప్పగలుగుతున్నామని వివరించారు.
మూడోసారి భారత్ కు వరల్డ్ కప్ గ్యారెంటీ, అదే విధంగా సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ గ్యారెంటీ అని చెప్పారు మంత్రి కేటీఆర్. తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని, 70 లక్షల కుటుంబాలకు రైతుబంధు, 46 లక్షల కుటుంబాలకు ఆసరా పెన్షన్లు, 13 లక్షల కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 14 లక్షల కుటుంబాలకు కేసీఆర్ కిట్ల ద్వారా లబ్ధి చేకూరిందని వివరించారు. వ్యక్తిగత సంక్షేమం, అభివృద్ధి ఫలాలు దాదాపు 90 శాతం మంది ప్రజానీకానికి అందాయని.. అందుకే మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ తోనే ఉంటారనే విశ్వాసం తమకు ఉందని చెప్పారు కేటీఆర్. హ్యాట్రిక్ గ్యారెంటీ అని ధీమాగా చెప్పగలుగుతున్నామని వివరించారు.
మూడోసారి గెలిస్తే..
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉన్నాయని, పేదవారి పట్ల ప్రేమ ఉందని చెప్పారు కేటీఆర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలయ్యే నాటికి, అంటే 2047 నాటికి.. తెలంగాణ ఎలా ఉండాలనే దార్శనికత తమకు ఉందని దాన్ని అందుకుంటామని వివరించారు. సంపద పెంచుతూ.. దానిని ప్రజల కోసమే ఖర్చుపెట్టడం తమ లక్ష్యం అని చెప్పారు.
బీజేపీ పోటీలో లేదు..
తెలంగాణలో గత ఆర్నెళ్లలో బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కొంత కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతోందని చెప్పారు కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనంగానే ఉందని, కొంత పుంజుకున్నట్లు కనిపించినా... 51శాతం ఓటింగ్ మాత్రం పొందలేదని తేల్చేశారు. తెలంగాణలోనే కాదని, కాంగ్రెస్ దేశంలో ఎక్కడా అధికారంలోకి రాలేదని చెప్పారు. కేసీఆర్ కు సరిసాటి నాయకులు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరూ లేరన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ అంటేనే మతకల్లోలాలు, కష్టాలు, కన్నీళ్లు, అంధకారం అని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల సంగతేమో గానీ, ఆర్నెళ్లలో సీఎం మారడం మాత్రం గ్యారెంటీ అన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లే ప్రశ్నాపత్రాలు లీక్ చేయిస్తారని, తిరిగి వాళ్లే పరీక్షలను వాయిదా వేయాలని గొడవలు చేస్తారని, వారే కోర్టుకు వెళ్తారని.. చివరకు వారే తమపై నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు కేటీఆర్. విపక్షాలపై దాడి చేయడం కంటే.. చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించడానికే తాము ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు.
♦