అవును.. ఇద్దరు ముగ్గురం ఉన్నాం

ఆలూ లేదు చూలూ లేదు సీఎం సీటు నాదేనంటూ కాంగ్రెస్ నేతలు కబుర్లు చెబుతున్నారు. సీట్ల కేటాయింపుల దగ్గరే సీన్ సితార అయ్యేలా ఉంది, ముందు ఆ సంగతి చూడండి అంటూ కోమటిరెడ్డిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Advertisement
Update:2023-10-12 18:37 IST

తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ఘంటాపథంగా చెబుతోంది. కేసీఆర్ సీఎం అనే విషయంలో ఎక్కడా ఎవరికీ క్లారిటీ మిస్ కాలేదు. ఒకవేళ కాంగ్రెస్ కి మెజార్టీ వస్తే అప్పుడు సీఎం ఎవరు..? సీఎం కుర్చీకోసం కొట్లాట ఏ స్థాయిలో ఉంటుందనే విషయంపై ముందుగానే బీఆర్ఎస్ పంచ్ లు వేస్తోంది. ఏడాదికో ముఖ్యమంత్రిని మార్చేస్తారని, ఢిల్లీనుంచి అంతా సీల్డ్ కవర్ వ్యవహారం నడుస్తుందంటూ ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పొరపాటున కూడా కాంగ్రెస్ కి ఓటేయొద్దని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలకు తగ్గట్టుగానే కాంగ్రెస్ లో సీఎం సీటు లొల్లి ముదిరింది. ఇద్దరు ముగ్గురం ఆశావహులం ఉన్నామని, వారిలో ఎవరో ఒకరు సీఎం అవుతారని తాజాగా సెలవిచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.


కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు బందే చేస్తామని హామీ ఇచ్చే క్రమంలో కోమటిరెడ్డి ఇలా నోరు జారారు. రేపు నేను వచ్చాక బెల్ట్ షాపులు తీసేస్తానని చెబుతూ.. "నేనంటే నేనో ఇంకెవరో ముఖ్యమంత్రి అవుతాం, మా దాంట్లో ఇద్దరు ముగ్గురున్నాం, ఎవరో ఒకరం సీఎం అవుతారం"టూ ముగించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

గతంలో అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ సీతక్క సీఎం అభ్యర్థి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో అందరికీ తెలుసు. అప్పట్లోనే సీనియర్లు నొచ్చుకున్నారు. ఇక రేపు నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటనేది ఆలోచించడానికే కష్టంగా ఉంది. ఆలూ లేదు చూలూ లేదు సీఎం సీటు నాదేనంటూ కాంగ్రెస్ నేతలు కబుర్లు చెబుతున్నారు. సీట్ల కేటాయింపుల దగ్గరే సీన్ సితార అయ్యేలా ఉంది, ముందు ఆ సంగతి చూడండి అంటూ కోమటిరెడ్డిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News