బీఆర్ఎస్ ని వీడుతున్నవారిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సమావేశమైన సందర్భంలో జంప్ జిలానీల ప్రస్తావన వచ్చింది. కష్ట‌కాలంలో పార్టీ నుంచి వెళ్తున్న వారిని మ‌ళ్లీ చేర్చుకోవ‌ద్ద‌ని ప‌లువురు నాయ‌కులు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Update:2024-03-05 19:26 IST

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత చాలామంది ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎంపీలు ఆల్రడీ జంప్ అయ్యారు, ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. మాజీలు, పదవులు లేని సీనియర్ల సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో పార్టీ వీడుతున్న వారిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సమావేశమైన సందర్భంలో జంప్ జిలానీల ప్రస్తావన వచ్చింది. కష్ట‌కాలంలో పార్టీ నుంచి వెళ్తున్న వారిని మ‌ళ్లీ చేర్చుకోవ‌ద్ద‌ని ప‌లువురు నాయ‌కులు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. పార్టీని వీడుతున్న వారిని మ‌ళ్లీ తీసుకునే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ వారికి స్ప‌ష్టం చేశారు.

"నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ రాములుకు ఏం త‌క్కువ చేశాం..? ఎంపీ రాములుతో పాటు ఆయ‌న కుమారుడికి అవ‌కాశాలు ఇచ్చాం. అవ‌కాశ‌వాదులు వ‌స్తుంటారు.. పోతుంటారు. ప్ర‌జ‌ల్లో ఉండాలి కానీ.. గెలుపు ఓట‌ములు ముఖ్యం కాదు." అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ భేటీలోనే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ అభ్య‌ర్థిగా మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి పేరును కేసీఆర్ ప్ర‌క‌టించారు. నాగ‌ర్‌క‌ర్నూల్ అభ్య‌ర్థిని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

కాంగ్రెస్ పై వ్యతిరేకత..

100 రోజుల పాలన పూర్తికాక ముందే కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వస్తోందని అన్నారు కేసీఆర్. రోజురోజుకూ కాంగ్రెస్ పాల‌న దిగ‌జారిపోతోందన్నారు. కాంగ్రెస్ నేత‌లు అల‌వికాని హామీలిచ్చి ఆశ‌లు రేకెత్తించారని, హామీల అమ‌లుపై నాలుక మ‌డ‌త‌పెట్టి ఇప్పుడు తిట్ల‌కు దిగుతున్నారని చెప్పారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌వారు డ‌బ్బులు లేవ‌ని చెప్ప‌డం స‌రికాదన్నారు. దుష్ప్ర‌చారాలు న‌మ్మి ఓట్లేసిన వారికి ఇప్పుడిప్పుడే వాస్త‌వాలు తెలుస్తున్నాయని చెప్పారు కేసీఆర్. 

Tags:    
Advertisement

Similar News