కేసీఆర్‌ రైతుల సీఎం.. రేవంత్‌ రెడ్డి బూతుల సీఎం

రాజకీయ నాయకుల మాటలను సెన్సార్‌ చేయాల్సిన పరిస్థితి తెస్తున్నడు : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-11-09 17:12 IST

కేసీఆర్‌ రైతుల సీఎం అయితే.. రేవంత్‌ రెడ్డి బూతుల సీఎం అని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని కుల్చారంలో శనివారం నిర్వహించిన రైతుధర్నాలో ఆయన మాట్లాడారు. పిల్లిశాపనార్థాలకు ఉట్లు తెగిపడవని.. రేవంత్‌ తిట్లకు గులాబీ జెండాలు భయడవన్నారు. కేసీఆర్‌ అంటే కిట్లు.. రేవంత్‌ అంటే తిట్లు అన్నారు. మూసీ మురికి కన్నా రేవంత్‌ మాటలే ఎక్కువ కంపు అన్నారు. సినిమాలకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినట్టు రేవంత్‌ మాటలను చూస్తుంటే రాజకీయ నాయకులకు మాటలను సెన్సార్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టు ఉందన్నారు. కేసీఆర్‌ రెండు సార్లు రైతుబంధు ఇస్తే మూడుసార్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన రేవంత్‌ ఉన్న రైతుబంధుకే ఎగనామం పెట్టిండన్నారు. రైతు ధర్నాకు తరలివచ్చిన వాళ్లందరినీ చూస్తుంటే మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ చేసేందుకు సునీత లక్ష్మారెడ్డి ఈ దీక్ష ఏర్పాటు చేశారన్నారు. వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కేసీఆర్ పాలన అంటేనే రైతు రాజ్యమని గుర్తు చేశారు. ఒక్క హామీ అమలు చేయకుండానే తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామని రేవంత్‌ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చెప్పుకుంటున్నాడని అన్నారు. దేవుళ్ల మీద రేవంత్‌ ఒట్టు పెట్టి రుణమాఫీ చేయలేదన్నారు.

రేవంత్‌ సీఎం అయ్యాక గ్యారంటీలకు, బాండ్‌ పేపర్లకు విలువ లేకుండా పోయిందన్నారు. సగం రుణమాఫీ కూడా బీఆర్‌ఎస్‌ పోరాటాలతోనే చేసిందన్నారు. హామీల అమలను వాయిదాలు వేస్తూ ఈ ప్రభుత్వం వాయిదాల ప్రభుత్వం అయ్యిందన్నారు. ఎక్కడ ఇండ్లు కూలగొట్టావో అదే మూసీ ప్రాంతంలో పాదయాత్ర చేద్దాం అని సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. మూసీ కాలుష్యం 66 ఏండ్ల కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల పుణ్యమేనన్నారు. నల్గొండ ఫ్లోరోసిస్‌ కూడా ఆ రెండు పార్టీల పుణ్యమేనన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు రూ.3,800 కోట్లతో మూసీ పునరుజ్జీవం ప్రారంభించారని తెలిపారు. ఆంధ్ర బాబుల బ్యాగులు మోసిన రేవంత్‌ కు కేసీఆర్‌, తెలంగాణ విలువ ఏం తెలుసన్నారు. తెలంగాణను ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్‌ అన్నారు. రుణమాఫీ, రైతుబంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌ ఇలా రేవంత్‌ రెడ్డి అన్ని ఎగ్గొట్టాడన్నారు. హైదరాబాద్‌ కు మూడు దిక్కుల సముద్రం ఉందట.. బాక్రానంగల్‌ ప్రాజెక్టు తెలంగాణలో ఉందట.. దిల్‌సుఖ్‌నగర్‌ లో విమానాలు అమ్ముతారట అది రేవంత్‌ రెడ్డి తెలివి అన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆదిలాబాద్‌ లో పుడితే నల్గొండలో పుట్టాడని రేవంత్‌ చెప్తున్నడు.. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఈ ముఖ్యమంత్రికి ఇంకేమి రావన్నారు. ఇప్పటికే 30 శాతం రైతులు తమ వడ్లను దళారులకు అమ్ముకున్నారని, క్వింటాల్‌ కు రూ.2,300 మద్దతు ధర ఉంటే వారికి దక్కింది రూ.1,700 మాత్రమేనని తెలిపారు. మిగిలిన వడ్లనైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.

ఫ్లైట్‌ మోడ్‌ లో ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫ్లైట్‌ మోడ్‌ లో నడుస్తోందని హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. సీఎం ప్రత్యేక విమానంలో మహారాష్ట్రకు పోతే డిప్యూటీ సీఎం మరో ప్రత్యేక విమానంలో జార్ఖండ్‌ వెళ్లారట.. మంత్రి శ్రీధర్‌ బాబు మలేషియాకు వెళ్తే, సీతక్క కేరళకు వెళ్లారట.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాళ్లు గాలిమోటార్లలో జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్నాటకలో ఐదు.. తెలంగాణలో ఆరు.. ఇప్పుడు మహారాష్ట్రలో గారడీ గ్యారంటీలు ఇస్తున్నారని ఇద్దేవా చేశారు. కాంగ్రెస్‌ గ్యారంటీల గురించి తెలిసే హర్యానాలో కాంగ్రెస్‌ ను ఓడగొట్టారన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో అదే పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణ ప్రజల మాదిరిగా మహారాష్ట్ర ప్రజలు మోసపోవద్దన్నారు. రైతులు కలెక్టర్ల కాళ్ల మీద పడాల్సిన దుస్థితిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈనెల 14 నుంచి డిసెంబర్‌ 9 వరకు ఏం సాధించారని విజయోత్సవాలు జరపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. రుణమాఫీ చేయనందుకా.. రైతుబంధు ఎగ్గొట్టినందుకా.. మహిళలకు రూ.2,500 ఇవ్వనందుకా, ఒక్క ఇల్లు కూడా కట్టించకుండా ఉన్న ఇండ్లు కూలగొట్టినందుకు విజయోత్సవాలు నిర్వహించాలా అని మండిపడ్డారు.

ఊళ్లల్లో సర్వేకు వస్తే రుణమాఫీ కాలేదని, పెన్షన్‌ పెంచలేదని, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, హామీలు అమలు చేయలేదని రాయించాలని సూచించారు. ఈ ప్రభుత్వంపై పోరాడితేనే హామీలు అమలవుతాయన్నారు. చిన్న ఘనపూర్‌ లో రాములు అనే కాంగ్రెస్‌ కార్యకర్త తనది ఆ పార్టీ అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నానని చెప్పాడని తెలిపారు. హామీలు అమలు చేయలేదని ప్రజలు తమను నిలదీస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు నాయకులు, కార్యకర్తలు వాపోయారన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే వంద సీట్లు గెలిచి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. పోలీసులు, అధికారులు తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఏపీలో పోలీసులకు ఏ పరిస్థితి వచ్చిందో ఇక్కడ తప్పదని హెచ్చరించారు. ఒక్క గణపురం సొసైటీలోనే 600 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ఏ వాగుల దూకుతాడో చెప్పాలన్నారు. ఇకనైనా రేవంత్‌ రెడ్డి ఏడుపాయల అమ్మవారు సహా ఓట్లు పెట్టిన దేవుళ్లందరి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్‌, మాణిక్‌ రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్‌, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News