ముఖ్యమంత్రివి నువ్వానేనా..? రేవంత్ కి కేసీఆర్ సూటి ప్రశ్న

ప్రభుత్వం తప్పించుకుందామనుకుంటే.. వీపులు విమానం మోత మోగుతాయని హెచ్చరించారు. నాలుగు నెలలైనా ప్రభుత్వానికి టైమ్ ఇవ్వాలని తాను నోరు తెరవలేదని, ఇప్పుడు ప్రజల కష్టాలు చూసి తాను బయటకు రావాల్సి వచ్చిందన్నారు కేసీఆర్.

Advertisement
Update:2024-04-05 19:37 IST

"పంటలు ఎండిపోయేంత వరకు ఏం చేశారు, ఎండిపోతుంటే ముందే చెప్పొచ్చు కదా.. ఇల్లు కాలిన తర్వాత చలిమంట కాచుకున్నట్టుగా బీఆర్ఎస్ వ్యవహారం ఉంది" అంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అసలు ముఖ్యమంత్రివి నువ్వా..? నేనా..? అని ప్రశ్నించారు. "రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రి ఎవరు? నీ ఇంజినీర్లు ఏం చేస్తున్నారు? నీ డిపార్ట్‌మెంట్‌ ఏం చేస్తోంది.? ఇరిగేషన్‌ మినిస్టర్‌ ఏం చేస్తున్నారు? అసలు నువ్వేం చేస్తున్నావ్‌ ? ప్రభుత్వం నీది కదా? ప్రజలు నిన్ను గెలిపించారు కదా? ప్రతిపక్షం ముందే చెప్పాలనడమేంటి..?" అంటూ నిలదీశారు.


తాను సూర్యాపేట నుంచి బయలుదేరి వెళ్తుంటే.. మూడు కాలువల్లోకి నీరు వదిలారని, ఆ తెలివి ముందేమైందని అన్నారు కేసీఆర్. ఎందుకు వేల ఎకరాల్లో పంటలు ఎండపెట్టారని సూటిగా ప్రశ్నించారు. నాగార్జున సాగర్‌ కాల్వనుంచి కొద్దిరోజుల ముందు నీళ్లు ఇచ్చి ఉంటే.. వేల ఎకరాల్లో పంట బతికేదని చెప్పారు. వరద కాల్వ కింద 20 రోజుల ముందు నీరు వదిలి ఉంటే.. ప్రతి గ్రామంలో వందల ఎకరాల్లో పంట దక్కేదని చెప్పారు. ఉన్న వనరులు, వసతులను కాంగ్రెస్ ప్రభుత్వం తెలివితో వాడుకోలేదని, క్వాలిటీ కరెంటు అందించలేదని, రైతుబంధు సమయానికి ఇవ్వలేదని.. వెర్రితిర్రి మాటలతో ప్రజలను గందరగోళానికి గురి చేశారని విమర్శించారు కేసీఆర్.

రేవంత్ వి గలీజ్ మాటలు..

సీఎం రేవంత్ రెడ్డి గలీజ్ గా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు కేసీఆర్. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారని తాము చెబితే.. 48గంటల్లో వివరాలు ఇస్తే నష్టపరిహారం ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. కానీ తాము 4 గంటల్లోనే లిస్ట్‌ను సీఎస్‌కు పంపించామని.. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదన్నారు. కాంగ్రెస్ అసమర్థత వల్ల రైతులు చనిపోయారు కాబట్టి.. కుటుంబానికి రూ.25లక్షలు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కేసీఆర్.

వీపు విమానం మోతే..

పంట నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారని, ఈరోజు వారికి తాను ధైర్యం చెప్పి వచ్చానన్నారు కేసీఆర్. పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ.25వేలు పరిహారం ఇవ్వాలన్నారు. 10 నుంచి 15లక్షల ఎకరాల్లో పంట నష్టం అంటే చిన్నమాట కాదని, అది ప్రకృతి విపత్తుకన్నా పెద్దదని అన్నారు. ప్రభుత్వం తప్పించుకుందామనుకుంటే.. వీపులు విమానం మోత మోగుతాయని హెచ్చరించారు. నాలుగు నెలలైనా ప్రభుత్వానికి టైమ్ ఇవ్వాలని తాను నోరు తెరవలేదని, ఇప్పుడు ప్రజల కష్టాలు చూసి తాను బయటకు రావాల్సి వచ్చిందన్నారు కేసీఆర్. 

Tags:    
Advertisement

Similar News