రేవంత్ రెడ్డిపై ట్రోలింగ్.. కేసీఆర్ ఏమన్నారంటే..?

తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని, రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేయాలని చెప్పారు కేసీఆర్.

Advertisement
Update:2024-04-29 08:59 IST

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్రే తెలియదన్నారు. ముఖ్యమంత్రి చిత్రవిచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారని, వరంగల్‌కు కాళేశ్వరం నీళ్లే రాలేదంటున్నారని ఎద్దేవా చేశారు. మరి మహబూబాబాద్‌, డోర్నకల్‌, పాలకుర్తి, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాలల్లో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో శ్రీరామసాగర్‌ స్టేజ్‌-2 అని చెబితే దశాబ్దాలు గడచినా నీళ్లు రాలేదని, తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి కాళేశ్వరం నిర్మించాక పసిడి పంటలు పండాయని గుర్తు చేశారు కేసీఆర్.

నదిని కట్టావా రేవంత్..?

రేవంత్ రెడ్డి కృష్ణా నది కూడా తానే కట్టానని అంటున్నారని సెటైర్లు పేల్చారు కేసీఆర్. "ఆమధ్య ఎక్కడో కృష్ణానదిని తానే కట్టానన్నారట రేవంత్ రెడ్డి.. ఎవరైనా నది కడతారా? దీనిపై సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు." అని అన్నారు కేసీఆర్. కాంగ్రెస్ హామీలకు ప్రజలు మోసపోయారన్నారు. అలా మోసపోవడం వల్లే నాలుగైదు నెలల్లోనే కరెంటు పోయిందని, సాగునీరు ఆగిపోయిందని, పంటలు ఎండుతున్నాయని చెప్పారు. గత పదేళ్లలో ఎప్పుడైనా ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు కేసీఆర్.

ఆ భాషేంటి..?

పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తాను, రేవంత్ రెడ్డిలాగా ఎప్పుడూ దిగజారి మాట్లాడలేదన్నారు కేసీఆర్. "గుడ్లు పీకి గోలీలు ఆడతాడట, పేగులు తీసి మెడలో వేసుకుంటాడట.. ఇలాగేనా ముఖ్యమంత్రి మాట్లాడేది" అని ప్రశ్నించారు. "నన్ను తీసుకుపోయి చర్లపల్లి జైల్లో వేస్తాడంట, నేనెప్పుడైనా జైళ్లకు భయపడ్డానా? కేసీఆర్‌ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఎన్ని దెబ్బలు తిన్నాం? ఎన్ని నిరాహార దీక్షలు చేశాం? పదవులను ఎడమ కాలి చెప్పులతో సమానంగా భావించి త్యాగాలు చేశాం." అని అన్నారు కేసీఆర్.

తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని, రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్‌లో కట్టిన 24 అంతస్తుల ఆసుపత్రే నిదర్శనం అని చెప్పారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదని, తెలంగాణలో ఎక్కువ లోక్‌సభ సీట్లను బీఆర్ఎస్ గెలిస్తే.. కేంద్రంలో హంగ్‌ వస్తే అప్పుడు మనం కీలకమవుతామని చెప్పారు కేసీఆర్. 

Tags:    
Advertisement

Similar News