వెన్నెముక లేని బీజేపీ నాయకులు.. కాజీపేట సంగతి ఏం చేశారు..?
తాజాగా అసోంలోని కొక్రాజార్ లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు మరోసారి భగ్గుమన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే విభజన చట్టంలో ఉన్న ఈ హామీని ఇంతవరకు అమలు చేయలేదు. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. తెలంగాణ నుంచి ఎనిసార్లు విజ్ఞప్తులు వెళ్లినా బుట్టదాఖలు చేసింది. పార్లమెంట్ లో నిలదీసినా నిస్సిగ్గుగా సమాధానం దాటవేశారే కానీ ఒక్కసారి కూడా సమాధానం చెప్పిన పాపాన పోలేదు. దేశంలో ఎక్కడా రైల్ కోచ్ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం లేదని 2017లో కేంద్రం ప్రకటించింది. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించింది.
ఎందుకీ వివక్ష..?
రైల్ కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదనే మాటకు కేంద్రం కట్టుబడి ఉందా అంటే అదీ లేదు. ఆ తర్వాత మహారాష్ట్రలోని లాతూర్ లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది, తాజాగా అసోంలోని కొక్రాజార్ లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు మరోసారి భగ్గుమన్నారు. కేంద్రం ప్రకటనను తీవ్రంగా దుయ్యబట్టారు మంత్రి కేటీఆర్. అసోంకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కేటాయింపుని తాము స్వాగతిస్తున్నామని చెబుతూనే తెలంగాణకు అన్యాయం ఎందుకు చేస్తున్నారని నిలదీశారాయన.
వెన్నెముకలేని నాయకులు..
తెలంగాణపై ఎనలేని ప్రేమని కురిపిస్తున్నట్టు నాటకాలాడే రాష్ట్ర బీజేపీ నేతలు, విభజన హామీల అమలులో కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. వెన్నెముకలేని రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు రైల్ కోచ్ ఫ్యాక్టరీలను కేటాయిస్తూ, తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించడంలో ఆంతర్యమేమిటన్నారు. సవతి తల్లి ప్రేమపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ట్విట్టర్లో నిలదీశారు.