ఎన్టీఆర్ సీఎం.. సీఎం.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానుల హంగామా
జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఘాట్ వద్దకు వందలాదిమంది ఫ్యాన్స్ తరలివచ్చారు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద ఎన్టీఆర్ సీఎం.. సీఎం.. అన్న నినాదాలు హోరెత్తాయి.
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. మంగళవారం తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్న వారు ఎన్టీఆర్ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు తమ తాతయ్యను స్మరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఘాట్ వద్దకు వందలాదిమంది ఫ్యాన్స్ తరలివచ్చారు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద ఎన్టీఆర్ సీఎం.. సీఎం.. అన్న నినాదాలు హోరెత్తాయి.
తన తాతయ్య నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అభివాదం చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఏడాది జనవరిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఘాట్ వద్ద ఏర్పాటు చేయగా వాటిని బాలకృష్ణ ఆదేశాల మేరకు తొలగించారన్న ప్రచారం జరిగింది.
దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. మరి కాసేపట్లో బాలకృష్ణ, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు నివాళులర్పించేందుకు ఘాట్ వద్దకు రానుండడంతో ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న పరిస్థితి అభిమానుల్లో, టీడీపీ కార్యకర్తల్లో నెలకొంది.