కాంగ్రెస్ లీడర్లకు జండూబామ్, జిందా తిలిస్మాత్
గ్రామాల్లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో పంపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
కాంగ్రెస్ లీడర్లకు జండూబామ్, జిందా తిలిస్మాత్ పంపారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. గ్రామ సభల్లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు సమస్యలు ఎక్కువయ్యాయని.. వాటి నుంచి ఉమశమనం కోసం తాము పంపుతున్న జండూబామ్, జిందా తిలిస్మాత్ ఉపయోగించాలని సూచించారు. శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు గ్యాదరి బాలమల్లు, బొమ్మెర రామ్మూర్తితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగు పథకాల అమలు పేరుతో నాలుగు రోజులు గ్రామ సభల్లో తీసుకున్న అప్లికేషన్లను ఎక్కడికక్కడ రోడ్లపై పడేశారని మండిపడ్డారు. గ్రామ సభలు కాస్త ప్రజా ఆగ్రహ సభలుగా మారాయన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. వాటిని అమలు చేయకపోవడంతో పోలీస్ పహారాలో గ్రామ సభలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల ఆగ్రహం చూసి మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామ సభలకు వెళ్లాలంటేనే భయ పడుతున్నారని తెలిపారు.
జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్ల పథకాలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటే.. మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి నాలుగు పథకాలు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం అంటున్నారని.. ఫిబ్రవరి వరకు అప్లికేషన్లు పెట్టుకోవాలని మంత్రి పొంగులేటి చెప్తున్నారని.. సీఎం, మంత్రుల మాటలకు పొంతన లేకపోవడమే కాదు విలువ కూడా లేదన్నారు. ఏడాది క్రితమే ప్రజాపాలన పేరుతో అప్లికేషన్లు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరోసారి రాష్ట్రంలోని ప్రజలందరినీ జిరాక్స్ సెంటర్ల ముందు నిలబెట్టిందని మండిపడ్డారు. ఇంతచేసి కాంగ్రెస్ కార్యకర్తలకే సంక్షమ పథకాలు ఇస్తామని ఎమ్మెల్యేలు చెప్తున్నారని.. అదే నిజమైతే గ్రామ సభలు ఎందుకు.. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుతో ప్రజలు, అధికారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామాలుంటే 600 గ్రామాల్లోనే నాలుగు పథకాలు అమలు చేస్తామనడం అంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. ప్రజలు గ్రామాల్లో తిప్పలు పడుతుంటే సీఎం, మంత్రులు హైదరాబాద్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తమ తీరు మార్చుకోకుంటే ప్రజలు వారిని ఉరికించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.