కాంగ్రెస్ టికెట్ కావాలంటే.. బాండ్ మీద సంతకం చేయాలి!
అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న వారు బాండ్ పేపర్ రాసిస్తేనే వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని టీపీసీసీ స్పష్టం చేస్తోంది.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేది కేవలం కాంగ్రెస్ మాత్రమే అని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా బలం లేదని, కనీసం పార్టీ తరపున బరిలో దిగడానికి అభ్యర్థులు కూడా లేరని భావిస్తున్నారు. దీంతో చాలా మంది నాయకులు కాంగ్రెస్ బాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం వారందరూ కాంగ్రెస్‌లో చేరుతున్నారని భావించిన అధిష్టానం.. సరికొత్త నిబంధన పెట్టినట్లు సమాచారం. ఈ సారి అసెంబ్లీ టికెట్ కావాలంటే బాండ్ రాసివ్వాలని షరతు పెడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారను. ఒక వేళ మారాల్సి వస్తే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాస్తేనే టికెట్లు ఇస్తామని ఖరాఖండీగా చెబుతున్నారు.
అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న వారు బాండ్ పేపర్ రాసిస్తేనే వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని టీపీసీసీ స్పష్టం చేస్తోంది. హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ బాండ్ పేపర్ పద్దతిని తీసుకొని వచ్చినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలు వెళ్లాయని.. బాండ్ పేపర్ పద్దతిపై స్పష్టమైన సూచనలు కూడా చేశారని తెలుస్తున్నది. టీ-కాంగ్రెస్ నాయకులు కూడా బాండ్ పేపర్ పద్దతికి ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పార్టీలో బాండ్ పేపర్ విధానాన్ని అసెంబ్లీ ఎన్నికల కోసమే ప్రవేశపెట్టలేదని కొందరు నాయకులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా కార్పొరేటర్ టికెట్ల ఆశించిన వారు కూడా బాండ్ పేపర్లపై సంతకం పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 2 డివిజన్లు మాత్రమే. దీంతో బాండ్ పేపర్ల వ్యవహారం బయటకు పెద్దగా తెలియలేదు. అయితే ఈ సారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా దీన్ని అమలు చేయనున్నారు.
ఎవరైనా బాండ్ పేపర్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఒక మాజీ ఎంపీ చెప్పారు. బాండ్ల వ్యవహారాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా లీగల్ సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. కేవలం కొత్తగా పార్టీలో చేరే వారికే కాకుండా పాత నాయకులకు కూడా ఈ బాండ్ పేపర్ పద్దతి అమలులో ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నాయకులు క్యూ కడుతున్నారు. కొంత మంది ఇతర పార్టీలో టికెట్ రాదనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇలాంటి వారు ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ మారొద్దనే ఉద్దేశంతోనే బాండ్ పేపర్ పద్దతిని తీసుకొని వచ్చినట్లు తెలుస్తున్నది.