నీ దగ్గర సమాధానం లేకపోతే.. ఇలాగే పారిపోతావు.. కేంద్ర మంత్రిపై కేటీఆర్ సెటైర్
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మీనాక్షి లేఖిని ఈ విషయంపై స్పందించమని మీడియా కోరగా మౌనం దాల్చారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహిళా రెజర్లు గత కొన్ని వారాలుగా తమపై రెజ్లింగ్ అసోసియేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ చేస్తున్న లైంగిక వేధింపులు, ఆగడాలపై చర్య తీసుకోవాలని.. తగిన న్యాయం చేయాలని పోరాడుతున్నారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ సందర్భంగా.. తమ నిరసనను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తే ఢిల్లీ పోలీసులు కొంత మందిని అరెస్టు చేశారు. కాగా, తమకు న్యాయం చేయకపోతే సాధించిన పతకాలన్నింటినీ హరిద్వార్‌లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని కూడా హెచ్చరించారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మీనాక్షి లేఖిని ఈ విషయంపై స్పందించమని మీడియా కోరగా మౌనం దాల్చారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఆమె పారిపోవడాన్ని 'తక్షణ స్పందన' అంటూ ఎద్దేవా చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో వాటర్ కూలర్, టాయిలెట్ ఓపెనింగ్‌కు వచ్చిన మంత్రి మీనాక్షి.. మీడియా నుంచి తప్పించుకొని పోతుండగా తీసిన వీడియోను షేర్ చేస్తూ విమర్శలు చేశారు. 'నేను 'బాగ్ మిల్కా బాగ్' అనే మాటను విన్నాను. కానీ ఇదేంటి 'బాగ్ మంత్రి బాగ్' లాగా ఉన్నది. మీ దగ్గర చెప్పడానికి సరైన సమాధానం లేకపోతే.. మీ ముఖాన్ని మీడియాకు, ప్రజలకు చూపించలేదు. ఇలాగే పారిపోతారు' అంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మహిళా రెజ్లర్లకు జరుగుతున్న అన్యాయంపై మంత్రి కేటీఆర్ మంగళవారమే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు బీజేపీ ఎంపీపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయడానికి ఇంత సమయం తీసుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ, హొం మంత్రి అమిత్ షా ఎందుకు బ్రిజ్ భూషణ్‌ను రక్షిస్తున్నారు. గంగలో తమ పతకాలు నిమజ్జనం చేస్తామన్నా.. కేంద్ర పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గు చేటు అని కేటీఆర్ అన్నారు.
రెజ్లర్లకు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్..
దేశభక్తి కలిగిన మన మహిళా రెజర్లు ఎంతో నిబద్దత, కష్టంతో దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై పెంచారు. కానీ కేంద్ర ప్రభుత్వం వారికి జరిగిన అన్యాయంపై ఏ మాత్రం స్పందించడం లేదు. పోస్కో చట్టం కింద కేసు నమోదు అయినా, ప్రజల్లోకి వచ్చి తమ బాధలను చెప్పుకున్నా వారికి న్యాయం జరగడం లేదు. దేశం యావత్తు వారికి న్యాయం జరుగుతుందా అని ఆలోచిస్తోంది. ప్రపంచం కూడా రెజ్లర్ల విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నది. ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.