తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం... అమిత్ షా
''ఒవైసీ అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. ఇక్కడి ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించడంలేదు. కానీ, బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వేడుకలను నిర్వహించి చూపించింది.'' అని అమిత్ షా అన్నారు.
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. చేవెళ్ళలో జరిగిన బీజేపీ విజయ్ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, ''ఒవైసీ అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. ఇక్కడి ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించడంలేదు. కానీ, బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వేడుకలను నిర్వహించి చూపించింది.'' అని అన్నారు.
తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని, టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి, పదో తరగతి ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయ్యాయి తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా పేపర్ లీక్ అవుతోందని అమిత్ షా ఆరోపించారు. ఏ ఒక్క పరీక్షను సక్రమంగా నిర్వహించలేని వారికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని అమిత్ షా మండిపడ్డారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారని, అయితే ప్రధాని సీటు ఖాళీగా లేదన్న విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలని అమిత్ షా అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీనే గెలుస్తుందని, మోడీ మరోసారి ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ అన్నారు.