రాజకీయాల్లో నేను ఫెయిల్ అయ్యాను.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నేను రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాను. 2019 ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్నానని పవన్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. అందులో నేను రాజకీయాల్లో విఫలం అవడం కూడా ఒకటని ఆయన అన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఏ విద్యార్థుల సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
నా దృష్టిలో చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నంత స్వచ్ఛంగా ప్రపంచంలో ఎవరూ ఉండరు. జవాబుదారీతనానికి వాళ్లు పర్యాయపదం లాంటి వారు. అలాంటి కోర్సు మీరు చేసినందుకు నేను అభినందనలు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. నా జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి. అందులో రాజకీయాలు కూడా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాను. 2019 ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్నానని పవన్ అన్నారు. కానీ, అక్కడితో తాను ఆగిపోలేదని.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడినట్లు పవన్ చెప్పారు.
విద్యార్థులు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో ఉండాలని పవన్ సలహా ఇచ్చారు. సీఏ పాస్ కావడం ఎంత కష్టమో తనకు తెలుసని, ఓటమి వచ్చినప్పుడు కృంగిపోవద్దని పవన్ సూచించారు. తాను రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు 'కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్' అనే ఓ వేదికను ఏర్పాటు చేశాను. ఆ సమయంలో ఎంతో మంది విద్యార్థులు, యువకులు తన దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్లు. వారి మాటలను బట్టి చూస్తే.. అన్నింటికీ ఇన్‌స్టాంట్ సొల్యూషన్ (సత్వర పరిష్కారం) కావాలని అర్థమయ్యేది. మ్యాగీ నూడుల్స్ లాగా, ఇన్ స్టంట్ కాఫీ లాగా అన్నీ నిమిషాల్లో అయిపోవాలని అనుకునే వారు.
కానీ యువత అలాంటి సత్వర పరిష్కారాలను ఆశించవద్దని, ఓపికతో ఉండాలని పవన్ హిత బోధ చేశారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన దశాబ్దం తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేసుకున్నారు. మనకు ఏదైనా అవకాశం వస్తే ఓపికతో ఉండి.. సరైన సమయం కోసం ఎదురు చూడాలని పవన్ కల్యాణ్ అన్నారు. కాగా, పవన్ కల్యాణ్ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. ఆ విషయంపై ఏనాడూ స్పందించని పవన్.. తాజాగా విద్యార్థుల ఎదుట తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని ఒప్పుకున్నారు.