సోషల్ మీడియా పోకిరీలకు హైదరాబాద్ పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్

కొంతమంది ఈ ట్రోలింగ్ ని మౌనంగా భరిస్తున్నా, మరికొందరు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం సెలబ్రిటీలే కాదు, సాధారణ మహిళలు ఫిర్యాదు చేసినా తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు డీసీపీ స్నేహ మెహ్రా.

Advertisement
Update:2023-03-29 20:58 IST

సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెడుతూ, మార్ఫింగ్ ఫొటోలతో రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలను ట్రోలింగ్ చేస్తున్న 8మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటిని వైరల్ చేస్తున్న ఈ పోకిరీలను ప్రత్యేక టీమ్ పట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవీరిని ఆ టీమ్ అరెస్ట్ చేసింది. కడప, కృష్ణా, నిజామాబాద్.. తదితర జిల్లాలనుంచి 8మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో 30మంది ట్రోలర్స్ కి నోటీసులిచ్చారు.

ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిపించిన సందర్భంలో చాలామంది ట్రోలర్లు అసభ్యకరంగా కామెంట్లు చేశారు. కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఫోటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్న వారిని గుర్తించారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానెళ్లవారు అసభ్యకరంగా థంబ్ నెయిల్స్ పెడుతూ వ్యూస్ కోసం ట్రోలింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. నెలరోజుల వ్యవధిలో ట్రోలింగ్‌ లపై 20 కేసులు నమోదు నమోదు చేశామని తెలిపారు సైబర్‌ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా.

ఇటీవల పార్టీలవారీగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేవారు విడిపోయారు. వ్యతిరేక వర్గాన్ని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఈ విమర్శలు శృతి మించుతున్నాయి. మితిమీరిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉండే మార్ఫింగ్ ఫొటోలతో సెటైర్లు వేస్తూ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది ఈ ట్రోలింగ్ ని మౌనంగా భరిస్తున్నా, మరికొందరు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం సెలబ్రిటీలే కాదు, సాధారణ మహిళలు ఫిర్యాదు చేసినా తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు డీసీపీ స్నేహ మెహ్రా. 

Tags:    
Advertisement

Similar News