సర్వేల షాక్.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అధిష్టానం ఆగ్రహం

బీసీ నేతలంతా పార్టీని వీడుతుండటంతో 'బీసీ వ్యతిరేక పార్టీ' అని మచ్చపడేలా ఉందని బీజేపీ అధిష్టానం ఆందోళనలో పడింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన బీసీ నేతలకు బీజేపీలో గౌరవం ఇవ్వరనే సంకేతాలు జనంలోకి వెళ్లాయని అనుమానిస్తోంది.

Advertisement
Update:2022-10-26 07:54 IST

బీజేపీ తెలంగాణ శాఖలో పదవులు, బాధ్యతలు మారిపోబోతున్నాయా, ఇన్ చార్జ్ లను కూడా పక్కనపెట్టి కొత్తవారిని తీసుకు రావాలనుకుంటున్నారా. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆ ముచ్చట మొదలవుతుంది. అవును, బండి సంజయ్ సహా, పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి సునీల్ బన్సల్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలింది. ముఖ్యంగా గత రెండు వారాల్లో జరిగిన పరిణామాలతో బీజేపీ అధిష్టానం తల పట్టుకుంది, రాష్ట్ర నాయకత్వానికి తలంటింది.

మీరు చెప్పిందేంటి..? జరుగుతున్నదేంటి..?

మునుగోడు విషయంలో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన రిపోర్ట్ తో బీజేపీ అధిష్టానం ధైర్యంగా అడుగు ముందుకు వేసింది. రాజగోపాల్ రెడ్డికి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంది. రాజీనామా చేయించి ఉప ఎన్నికకు సిద్ధమైంది. అప్పట్లో కాంగ్రెస్ నాయకులంతా బీజేపీలోకి వచ్చేస్తారని, మునుగోడులో విజయం రాజగోపాల్ రెడ్డిదే అవుతుందని గొప్పలు చెప్పుకున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా భరోసా ఇవ్వడంతోనే ఉప పోరు మొదలైంది. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా కాంగ్రెస్ నేతలెవరూ ఆయన వెంట రాలేదు. 18వేల కోట్ల కాంట్రాక్ట్ వ్యవహారం జనంలోకి వెళ్లడంతో బీజేపీ కూడా పలుచన అయింది. ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ అంతర్గత సర్వేలు దారుణ ఫలితాలు చూపెడుతున్నాయి. మూడో స్థానం వస్తుందని చెబుతున్న సర్వేలతో అధిష్టానంలో ఆందోళన పెరిగిపోతోంది.

లాభం లేదు, నష్టమే..

మునుగోడు ఉప ఎన్నికను అడ్డు పెట్టుకుని, చేరికలతో బలపడదామని అనుకున్నారు బీజేపీ జాతీయ నేతలు. చేరికలు లేకపోగా, చేజారేవారు ఎక్కువయ్యారు. భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్.. వంటి కీలక నేతలు పార్టీని విడిచిపెట్టారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరినా ఆయన వల్ల ప్రయోజనం లేదంటున్నారు. ఇక చిన్న స్థాయి నేతలు, కార్యకర్తల సంగతి సరే సరి. అందరూ టీఆర్ఎస్ కే క్యూ కడుతున్నారు. పైగా కాంగ్రెస్ నుంచి కూడా వలసలు టీఆర్ఎస్ వైపే ఎక్కువగా ఉండటం బీజేపీకి మింగుడు పడటంలేదు. ముఖ్యంగా బీసీ నేతలంతా పార్టీని వీడుతుండటంతో 'బీసీ వ్యతిరేక పార్టీ' అని మచ్చపడేలా ఉందని బీజేపీ అధిష్టానం ఆందోళనలో పడింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన బీసీ నేతలకు బీజేపీలో గౌరవం ఇవ్వరనే సంకేతాలు జనంలోకి వెళ్లాయని బీజేపీ అనుమానిస్తోంది.

రాష్ట్ర నాయకత్వానికి తలంటు..

చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ని నియమిస్తే, చేరికలు లేకపోగా నాయకులు పార్టీని వీడుతున్నారని అసహనం వ్యక్తం చేశారట పార్టీ జాతీయ నేతలు. అటు బండి సంజయ్ కి కూడా ఇటీవల బాగానే తలంటారని తెలుస్తోంది. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ను కూడా ఉప ఎన్నిక తర్వాత ఆయా పదవులనుంచి తప్పిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫైనల్ గా మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి ఓ పెద్ద గుణపాఠంగా మిగిలిపోతోందన్నమాట.

Tags:    
Advertisement

Similar News