ఆ హామీలన్నీ నెరవేరాయి.. గుర్తుందా..?

కేసీఆర్ లేకపోతే సిద్ధిపేట జిల్లా అయ్యేదా, కాళేశ్వరం సాకారమయ్యేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. గోదావరి నీళ్లు సిద్ధిపేటకు వస్తాయంటే ప్రతిపక్షాలు వెటకారమాడాయని, కానీ కేసీఆర్ సాధించి చూపించారని చెప్పారు.

Advertisement
Update:2023-10-17 19:12 IST

గత ఎన్నికల్లో సిద్ధిపేట సభకు వచ్చిన సీఎం కేసీఆర్.. హరీష్ ని మళ్లీ గెలిపించండి.. సిద్ధిపేట జిల్లా అవుతుంది, సిద్ధిపేటకు రైలు వస్తుంది, సిద్ధిపేటకు గోదావరి జలాలు వస్తాయి.. అని చెప్పారని, ఇప్పుడు అవన్నీ నిజమయ్యాయని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తో కలసి ఆయన పాల్గొన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు, జన్మ ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ కు, సిద్ధిపేట ప్రజలకు సేవ చేసుకుంటానని, మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు చర్మం వలిచి చెప్పులు కుట్టించుకున్నా తక్కువేనన్నారు. జన్మంతా కేసీఆర్ కు, ప్రజలకు రుణపడి ఉంటానన్నారు హరీష్ రావు.


కేసీఆర్ కారణ జన్ముడు..

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అప్పట్లో సీఎం కేసీఆర్ తెలంగాణ కార్యసాధన గురించి ఎంత గొప్పగా చెప్పారో వివరించారు హరీష్ రావు. తెలంగాణ రావాలని చాలామంది కలగన్నారని, కానీ ఆ కలను నిజం చేసే అదృష్టం కేసీఆర్ కే సాధ్యమైందని చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ కలగన్నారని, ఆ కలను సాకారం చేసుకున్నారని, సాధించిన తెలంగాణను అభివృద్ధి చేసే అకాశం కూడా ఆయనకే దక్కిందని ఆయన అదృష్టవంతుడని ప్రణబ్ చెప్పారని అన్నారు హరీష్ రావు. కేసీఆర్ కారణ జన్ముడని చెప్పారు హరీష్ రావు.

కేసీఆర్ లేకపోతే సిద్ధిపేట జిల్లా అయ్యేదా, కాళేశ్వరం సాకారమయ్యేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. గోదావరి నీళ్లు సిద్ధిపేటకు వస్తాయంటే ప్రతిపక్షాలు వెటకారమాడాయని, కానీ కేసీఆర్ సాధించి చూపించారని చెప్పారు. ఒకప్పుడు సిద్ధిపేట కరువునేలగా ఉండేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. సిద్ధిపేట డిక్షనరీలో కరువు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించింది కేసీఆరేనని చెప్పారు హరీష్ రావు. 

Tags:    
Advertisement

Similar News