తెలంగాణ తల్లికి హరీశ్ పుష్పాంజలి
2015లోనే అధికారికంగా విగ్రహావిష్కరణ
సంగారెడ్డి కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి హరీశ్ రావు పుష్పాంజలి ఘటించారు. బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లిన హరీశ్ రావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 2015 జూన్ 2న తాను మంత్రి హోదాలో కలెక్టరేట్‌లో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌లతో కలిసి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించానని గుర్తు చేశారు. అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలోనే ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
మాజీ ఎమ్మెల్సీకి పరామర్శ
మాజీ ఎమ్మెల్సీ, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు ఆర్. సత్యనారాయణను మాజీ మంత్రి హరీశ్ రావు బుధవారం పరామర్శించారు. కొంతకాలంగా సత్యనారాయణ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయనకు అందిస్తున్న వైద్యం, ఇతర అంశాల గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఎమ్మెల్యే చింత ప్రభాకర్, స్థానిక నాయకులు ఉన్నారు.