ఉద్యోగమిచ్చారు, జీతం మరిచారు.. రేవంత్‌ సర్కార్‌పై హరీష్‌ సెటైర్లు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు 4 నెలలుగా వారికి జీతాలు చెల్లించడం లేదన్నారు.

Advertisement
Update:2024-05-21 10:28 IST

ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని రేవంత్ సర్కార్‌ గొప్పలు చెప్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. కానీ, వారికి 4 నెలలుగా జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. ఇదే విషయంపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు 4 నెలలుగా వారికి జీతాలు చెల్లించడం లేదన్నారు. LB స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప.. వారి జీతభత్యాల గురించి అసలు పట్టించుకోవడం లేదన్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన దాదాపు 4 వేల మంది నర్సింగ్ ఉద్యోగులు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు హరీష్ రావు.


ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలన్నారు హరీష్ రావు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాలుగు నెలల జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

2022 డిసెంబర్‌లో 7 వేల 94 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9 విభాగాల్లో 6 వేల 956 మందిని ఎంపిక చేశారు. ఆర్థోపెడికల్ ఛాలెంజ్‌డ్ కేటగిరిలో అభ్యర్థులు లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదు. అయితే తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎంపికైన అభ్యర్థులకు ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. వీరికి నెలకు 36 వేల 750 రూపాయల జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, గత నాలుగు నెలలుగా వీరికి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags:    
Advertisement

Similar News