వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ఇకనైనా బాధితులకు సాయం అందేలా చూడండి.. సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు లేఖ

Advertisement
Update:2024-09-21 19:08 IST

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. ఇకనైనా వరద బాధితులకు సాయం అందేలా చూడాలని కోరుతూ శనివారం సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, సూర్యాపేట్, వరంగల్ తో పాటు పలు జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయని తెలిపారు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 33 మంది ప్రాణాలు కోల్పోయారని, రూ.5,438 కోట్ల ఆస్తి నష్టం, 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వ లెక్కల్లోకి రాని మరణాలు, ఆస్తి, పంట నష్టం ఇంకా ఎక్కువే ఉందన్నారు. వరదలు అందరి మనసులను కలచి వేశాయని.. వరదల్లో ఆత్మీయులను కోల్పోయివారి రోదనలు అందరి మనసులను కలచి వేస్తున్నాయని తెలిపారు. వరద బాధితుల్లో ఎవరిని పలకరించినా హృదయాన్ని కదిలించే కన్నీటి గాథలే వినిపిస్తున్నాయని తెలిపారు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి కనీస ఓదార్పు కరువయిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పాలకులు తమకు అండగా ఉన్నారనే ధీమా ప్రజలకు కల్పించాలని.. కానీ ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా విపత్తును ఎదుర్కొనే సన్నాహక చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని.. ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ విఫలమైందన్నారు. ముంపు ప్రదేశాలను ముందే గుర్తించి ఆ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడంలోనూ విఫలమయ్యారని అన్నారు. వరదలు తగ్గి ఇన్ని రోజులవుతున్నా కనీసం బురదను పూర్తిగా తొలగించలేదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నా.. వరదల్లో చిక్కుకున్న 9 మందిని కాపాడలేకపోయారన్నారు. చివరికి ఒక హెలీక్యాప్టర్‌ కూడా దిక్కులేని దీన రాష్ట్రంగా తెలంగాణను మార్చారని మండిపడ్డారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఒక జేసీబీ డ్రైవర్‌ ప్రాణాలకు తెగించి కాపాడారని.. అంటే ఇంతకుమించిన చేతకానితనం ఇంకేమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. విషాద సందర్భాల్లోనూ చిరునవ్వులతో చేతులూపుతూ ప్రచార పర్యటన చేసిన విధానం చూసి ప్రజలు విస్తుపోయారన్నారు.

వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10 వేలు, ఆ తర్వాత నష్టం స్థాయిని బట్టి సాయం చేస్తామని హామీ ఇచ్చి.. మొత్తంగా రూ.16,500ల సాయానికే బాధితులను పరిమితం చేశారని తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువులు చెడిపోయి కట్టుబట్టలతో మిగిలిన వారికి సర్కారు ఇస్తున్న సాయం ఏమేరకు సరిపోతుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఇండ్లు కూలిన పేదలకు రూ.18 వేలు మాత్రమే ఇస్తున్నారని, ఆ సాయం కేవలం 146 మందికే పరిమితం చేశారని తెలిపారు. రుణమాఫీ లబ్ధిదారులను కుదించినట్టే వరద బాధితుల సంఖ్యను కుదించే ప్రభుత్వ ప్రయత్నాలు సిగ్గు చేటు అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదన్నారు. చిరు వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లిందని, వారి జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని గుర్తు చేశారు. భారీ వర్షాలు, వరదలతో పంట మునిగి నష్టపోయిన వారికి ఇస్తున్న రూ.10 వేల సాయం కూడా సరిపోదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారని.. ఇప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రైతులకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. వరద ప్రభావం తగ్గి 20 రోజులు గడిచినా ప్రభుత్వ సాయం అందడం లేదని, సర్వే సమయంలో బాధితులు ఇండ్ల వద్ద లేరని, బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు ఇవ్వలేదని, ఇల్లు మునిగిన ఫొటోలు లేవని.. ఇతర సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ పరిహారం ఇవ్వడం లేదన్నారు. సీఎం ఇకనైనా మీడియా మేనేజ్‌మెంట్‌ విడనాడి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ పై దృష్టి సారించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలకు తగ్గకుండా, ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయిన వారికి రూ.10 లక్షలు, ఇల్లు కూలిపోయిన, సామగ్రి నష్టపోయిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. చిరు వ్యాపారులకు రూ.5 లక్షల నష్టపరిహారంతో పాటు వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News