క్యాంప్‌ ఆఫీసుపై దాడి.. హరీష్‌ రియాక్షన్‌ ఏంటంటే!

పోలీసుల ఆధ్వర్యంలోనే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్న హరీష్‌ రావు.. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని కోరారు.

Advertisement
Update:2024-08-17 09:17 IST

సిద్దిపేటలోని తన క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై స్పందించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. అర్ధరాత్రి ఒక ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్‌ గూండాలు దాడి చేయడం రాష్ట్రంలో శాంతిభద్ర‌తలు లేవనడానికి నిదర్శనమన్నారు. తాళాలు పగులగొట్టి, ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం అన్న హరీష్‌ రావు, ఇది తీవ్రమైన చర్య అంటూ సీరియస్ అయ్యారు.


క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని అడ్డుకోకపోవడమే కాకుండా, నిందితులకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు హరీష్‌ రావు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత నిర్దాక్షిణ్యంగా దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసుల ఆధ్వర్యంలోనే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్న హరీష్‌ రావు.. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రైతు రుణమాఫీ విషయంలో హరీష్‌ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొద్దిరోజులుగా డైలాగ్‌ వార్ నడుస్తోంది. రుణమాఫీ పూర్తి చేశామని, హరీష్‌ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వైరా సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. హరీష్‌ రావుపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. సిగ్గు, లజ్జ ఉంటే రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. కాగా, ఆగస్టు 15 నాటికి రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే తాను రాజీనామా చేస్తానని చెప్పానంటున్నారు హరీష్‌ రావు. ఇందుకు సంబంధించి తన పాత వీడియోలను చూపిస్తున్నారు. ఇక రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదని చెప్తున్నారు హరీష్ రావు. నిబంధనల పేరుతో లక్షల మంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశారని ఆరోపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News