రీజినల్‌ రింగ్‌ రోడ్డు బాధితులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి

బలవంతపు భూసేకరణతో ప్రభుత్వం కర్కశంగా ప్రవర్తిస్తోంది : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-12-07 12:39 IST

రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో భూములు కోల్పోయే వారికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. శనివారం ట్రిపుల్‌ బాధిత రైతులు క్యామ మల్లేశ్‌ ఆధ్వర్యంలో హరీశ్‌ రావును కలిశారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి.. ఇప్పుడు బలవంతంగా తమతో సంతకాలు చేయించుకుంటూ భూములు లాక్కుంటున్నారని వివరించారు. భూసేకరణ చట్టం అమలు చేయడం లేదని, తక్కువ ధరకే భూములు లాక్కుంటున్నారని తెలిపారు. రీజినల్‌ రింగ్‌ రోడ్‌ ఉత్తర వైపు నిర్వాసితులకు న్యాయం చేస్తామని లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. ఉత్తరం వైపున 40 కి.మీ.లకు బదులుగా 28 కి.మీ.లను పరిగణలోకి తీసుకోవడంతో చౌటుప్పల్‌ మున్సిపాలిటీతో పాటు మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మున్సిపాలిటీ మధ్యలోంచి రోడ్డు పోతుందని, రెండు పంటలు పండే భూములను రైతులు కోల్పోతున్నారని తెలిపారు. గతంలో చౌటుప్పల్‌ వద్ద 78 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పుడు 184 ఎకరాలకు పెంచడంతో పేదలు భూములు, ప్లాట్లు కోల్పోతున్నారని తెలిపారు.

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ట్రిపుల్‌ బాధితులతో కలిసి అలైన్‌మెంట్‌ మార్చాలని కోరుతూ ధర్నాలు చేశారని గుర్తు చేశారు. ఆయనే ఇప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకొని సర్వే చేయిస్తూ బలవంతంగా బాధితులతో సంతకాలు పెట్టించుకోవడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌ అంటేనే మోసం చేయడం, ఏమార్చడం అన్నారు. ఫార్మాసిటీ పేరుతో పచ్చటి పొలాల్లో చిచ్చు పెట్టి గిరిజనులను జైళ్ల పాలు చేశారన్నారు. భూసేకరణ పేరుతో బాధితుల పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ వారిని క్షోభకు గురి చేస్తుందని, దాడులకు పాల్పడుతోందని అన్నారు. బాధితులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ గతంలో డిమాండ్‌ చేసినట్టుగానే అలైన్‌మెంట్‌ మార్చాలని, లేదంటే రైతులకు సంతృప్తికరమైన పరిహారం ఇచ్చి వారి అంగీకారంతోనే భూ సేకరణ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే బీఆర్‌ఎస్‌ బాధితుల పక్షాన ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాధితుల గొంతును వినించి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సమస్య పరిష్కరించే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందన్నారు.

Tags:    
Advertisement

Similar News