మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి

పిల్లలు ట్రాక్‌పైకి వెళ్లడం.. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తుండటాన్ని గమనించిన తండ్రి కృష్ణ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. వెంటనే వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు.

Advertisement
Update:2024-08-12 07:09 IST

అతనొక రైల్వే ట్రాక్‌ మేన్‌. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మేడ్చల్‌లోని రాఘవేంద్రనగర్‌లో అతని కుటుంబం నివసిస్తోంది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలిద్దరూ ఇంటివద్దే ఉన్నారు. తండ్రి కృష్ణ డ్యూటీకి వెళుతుండగా తామూ వస్తామంటూ వెంట వెళ్లారు. ఇద్దరు కుమార్తెలనూ తీసుకుని వెళ్లిన కృష్ణ వారిని తాను పనిచేసే ప్రదేశానికి సమీపంలో ఉంచి తన విధుల్లో నిమగ్నమయ్యాడు.

ఈ క్రమంలో అతని కుమార్తెలు వర్షిత (11), వరిణి (5) ఆడుకుంటూ రైలు పట్టాలపైకి వెళ్లారు. అదే సమయంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తుండటాన్ని వారు గమనించలేదు. అయితే పిల్లలు ట్రాక్‌పైకి వెళ్లడం.. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తుండటాన్ని గమనించిన తండ్రి కృష్ణ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. వెంటనే వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు.

అయితే అతని ప్రయత్నం ఫలించలేదు. అప్పటికే దగ్గరకు వచ్చేసిన రైలు ముగ్గురినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గౌడవెల్లి రైల్వేస్టేషన్‌ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News