దివిటిపల్లిలో ఐటీ టవర్.. మే 6న ప్రారంభించబోతున్న కేటీఆర్
మే-6 మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ ఐటీ టవర్ ని ప్రారంభించబోతున్నారు. ఈమేరకు ప్రారంభోత్సవ కార్యక్రమాల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అధికారులు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటి పల్లి శివారులో నూతనంగా ఐటీ టవర్ ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఈ టవర్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మే-6 మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ ఐటీ టవర్ ని ప్రారంభించబోతున్నారు. ఈమేరకు ప్రారంభోత్సవ కార్యక్రమాల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అధికారులు. తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ప్రారంభోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కనెక్టింగ్ రోడ్, ముఖద్వారం..
దివిటిపల్లిలో ఐటీ టవర్స్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. దీనికి సంబంధించి కనెక్టింగ్ రోడ్, ముఖద్వారాన్ని నిర్మించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్-బెంగళూరు హైవే-44 నుంచి దివిటిపల్లి శివారులోని ఐటీ టవర్ వరకు 100 అడుగుల రోడ్డు నిర్మించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. కనెక్టింగ్ రోడ్ ప్రారంభమయ్యే చోట ఆకర్షణీయంగా భారీ ముఖద్వారం నిర్మించాలని సూచించారు. ఐటీ టవర్ నుంచి మహబూబ్ నగర్ కు కనెక్టింగ్ రోడ్లు ఉండాలని సూచించారు.
నాలుగేళ్లలో 40వేలమందికి ఉపాధి..
ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ కి పేరుండగా.. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ దివిటిపల్లిలో ఐటీ టవర్స్ నిర్మిస్తున్నారు. నాలుగేళల్లో 40 వేల మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుందని చెప్పారు అధికారులు. విస్తరణకు అవకాశాలున్నాయని, ఐటీ ఉద్యోగులకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు.