సిటీలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు..ప్లేట్‌లెట్స్‌కు భారీగా డిమాండ్‌

గత నెలతో పోలిస్తే రక్తమార్పిడి అవసరమైన కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. బ్లడ్‌ బ్యాంకులు, సోషల్ మీడియాలోని రక్త దాతల గ్రూపుల్లో ప్లేట్‌లెట్స్‌ కోసం రోజుకూ 20కి పైగా అభ్యర్థనలు వస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2023-09-22 11:52 IST

హైదరాబాద్‌లో డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో ప్లేట్‌లెట్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గత నెలతో పోలిస్తే రక్తమార్పిడి అవసరమైన కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. బ్లడ్‌ బ్యాంకులు, సోషల్ మీడియాలోని రక్త దాతల గ్రూపుల్లో ప్లేట్‌లెట్స్‌ కోసం రోజుకూ 20కి పైగా అభ్యర్థనలు వస్తున్నట్లు తెలుస్తోంది. సిటీలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 1500 డెంగ్యూ కేసులు నమోదవగా..క్రమంగా పెరుగుతున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు.

అయితే ఈ సమస్యను హైలైట్ చేస్తూ..హైదరాబాద్‌ బ్లడ్ డోనర్స్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన ప్రశాంత్ ఇజ్జగిరి ట్వీట్ చేశారు. తెలంగాణలో డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. గత మూడు రోజుల్లోనే 100 మందికి పైగా ప్లేట్‌లెట్స్‌ కోసం కాల్స్ చేశారని చెప్పారు. ఈ కాల్స్ ఎక్కువగా హైదరాబాద్‌, కరీంనగర్ నుంచే ఉన్నాయన్నారు. ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 15000 వేల దిగువకు పడిపోయినప్పుడే వీటి అవసరం ఉంటుందని చెప్పారు. దీంతో పాటు ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం, రుతుస్రావం వంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్‌లెట్‌ మార్పిడి అవసరం ఉంటుందన్నారు. ప్లేట్‌లెట్‌ కౌంట్ తక్కువగా ఉంటే అది రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుందన్నారు.

బ్లడ్ బ్యాంకు లెక్కల ప్రకారం..హెల్త్‌ కేర్‌ సెంటర్లలో వారానికి ప్లేట్‌లెట్‌ మార్పిడి అవసరమయ్యే కేసులు 7-10 వరకు ఉంటాయి. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో అంతర్గతంగా అవసరాలు తీర్చే అవకాశం ఉన్నప్పటికీ.. చాలా మంది రోగులు దాతలపై ఆధారపడుతున్నారు. గడిచిన వారం, పది రోజులుగా ప్లేట్‌లెట్స్ కోసం డిమాండ్‌ పెరుగుతోందన్నారు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో రక్త మార్పిడికి ఉపయోగించే అధునాతన యంత్రాలు ఉన్నాయని.. దాంతో దాతలతో సిద్ధంగా ఉండాలని రోగులకు డాక్టర్లు సూచిస్తున్నారని చెప్పారు. తమ దగ్గర ఉన్న డేటా ఆధారంగా రోగులకు దాతలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.


Tags:    
Advertisement

Similar News