దళితబంధు సంగతేంటి..? రోడ్డెక్కిన నేతలు
గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాపల్లి కలెక్టరేట్ ను దళిత సంఘాల నాయకులు ముట్టడించారు.
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికే ఆపసోపాలు పడుతోంది. ఒకట్రెండు హామీలు అమలయ్యాయని అనుకున్నా.. కీలక హామీల అమలుకి 100రోజుల డెడ్ లైన్ పెట్టుకుని కాస్త రిలాక్స్ మూడ్ లోకి వెళ్లారు నేతలు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కొనసాగించే ఉద్దేశం ఉందా లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు వినపడుతున్నాయి. తాజాగా దళిత సంఘాల నేతలు.. 'దళిత బంధు' అమలుకోసం రోడ్డెక్కారు.
గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాపల్లి కలెక్టరేట్ ను దళిత సంఘాల నాయకులు ముట్టడించారు. ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే దళిత బంధు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పథకాన్ని యధావిధిగా కొనసాగించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసితీరాల్సిందేనన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ వైఖరి ఏంటి..?
బీఆర్ఎస్ అమలు చేస్తున్న కొన్ని పథకాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పింది. 24గంటల కరెంటుని కొనసాగిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. అయితే బీఆర్ఎస్ హయాంలో 24గంటల ఉచిత విద్యుత్ అమలు కావడంలేదని వారు ఆరోపించారు కూడా. పెన్షన్లు పెంచడం సహా ఇతర కొత్త హామీలిచ్చారు కానీ దళితబంధు విషయంలో వాళ్లు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. ఎన్నికల ముందు, తర్వాత ఇంటర్యూల్లో దళితబంధు కొనసాగించే విషయంపై కాంగ్రెస్ నేతలు ఎవరూ స్పందించలేదు. కొత్త హామీలు ప్రస్తావించారే కానీ, పాత హామీల జోలికి వెళ్లలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒకరకంగా దళితబంధు రద్దయినట్టే అనుకోవాలి. కానీ గ్రామాల్లో దళితబంధు అందని పేదవారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా అడుగులేస్తున్నారు. మధ్యే మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.