దశాబ్ది సంబరం.. నేడు తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం

గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణతో అడుగులు వేయిస్తున్న సీఎం కేసీఆర్, పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటి వరకు తెలంగాణలో రూ. 13,528 కోట్లు ఖర్చు చేశారు.

Advertisement
Update:2023-06-15 09:32 IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు 14వ రోజుకి చేరుకున్నాయి. ఇందులో భాగంగా నేడు పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపేందుకు పలు కార్యక్రమాలు రూపొందించారు. అవార్డులు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు ఈరోజు సన్మానం చేస్తారు. తెలంగాణ పల్లె ప్రగతిని మరోసారి గుర్తు చేసేలా ఈ రోజు కార్యక్రమాలుంటాయి.

గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణతో అడుగులు వేయిస్తున్న సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం, పరిసరాలను పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్‌, నర్సరీ, డంపింగ్‌ యార్డుల్లో పిచ్చి మొక్కలు తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టారు. పల్లెలను మరింత పరిశుభ్రంగా మార్చారు, ఆధునిక హంగులద్దారు.

పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటి వరకు తెలంగాణలో రూ. 13,528 కోట్లు ఖర్చు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ను ఏర్పాటు చేశారు. 12745 గ్రామపంచాయతీల్లో రూ. 1329.73 కోట్ల ఖర్చుతో వైకుంఠధామాలు నిర్మించారు. 12756 గ్రామపంచాయతీల్లో రూ. 238.09 కోట్ల ఖర్చుతో ఫంక్షనల్ నర్సరీలను పూర్తి చేశారు. 20.16 కోట్ల మొక్కలను పెంచారు. ప్రకృతి వనాలు, అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా పల్లెల్లో పచ్చదనాన్ని మరింత పెంచారు. రూ. 524.57 కోట్లతో 2598 రైతు వేదికల నిర్మాణం జరిగింది. రూ. 143.43 కోట్లతో 22,180 డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ లను నిర్మించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పల్లె ప్రగతిని మరోసారి గుర్తు చేసుకుంటూ.. దశాబ్ది ఉత్సవాల్లో పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News